శాశ్వత నీటి పారుదల పోరాట వేదిక ప్రారంభోత్సవంలో సినీనటుడు శివరాజ్‌కుమార్
నీటి పోరాటానికి శాండిల్‌వుడ్ బాసట
కోలారుకు కదలి వచ్చిన సినీ ప్రముఖులు
కోలారు : ప్రపంచానికి బంగారాన్ని అందించిన కోలారు జిల్లా నేడు తాగు, సాగునీటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ఈ ప్రాంతానికి శాశ్వత జలాల సౌలభ్యాలు అందాలంటే నిరంతర పోరాటాలే శరణ్యమని సినీ నటుడు శివరాజ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజలు చేపట్టే ఆందోళనలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. బయలుసీమ జిల్లాలకు శాశ్వత నీటి పారుదల సౌలభ్యాల కోసం ఏర్పాటు చేసిన శాశ్వత నీటిపారుదల పోరాట వేదికను ఆదివారం ఆయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి కోలారులో ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న సినీ ప్రముఖులు శివరాజ్‌కుమార్, యశ్, సాధుకోకిల, పూజాగాంధీ, రాగిణి ద్వివేది, పద్మావాసంతి, చిరంజీవి సర్జా, రాక్‌లైన్ వెంకటేష్, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు థామస్ డిసౌజా, సారా గోవిందు, ఆది లోకేష్, ప్రముఖ నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్, చలన చిత్ర రంగానికి చెందిన కార్మిక, నిర్మాపక, దర్శక సంఘాల ప్రముఖులు ఐషర్ వాహనంలో ర్యాలీగా సర్వజ్ఞ పార్కు వద్ద ఏర్పాటు చేసిన శాశ్విత నీటిపారుదల పోరాట వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శాశ్వత నీటి పారుదల పోరాట వేదికను జ్యోతి వెలిగించి ప్రారంభించిన శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ పోరాట వేదికలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నీటి సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమించాలన్నారు.
ఈ పోరాటంలో తాము కూడా పాలు పంచుకుంటామన్నారు. జిల్లాకు తాగునీటిని అందించే విషయంలో తాము ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమన్నారు. నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పశ్చిమ కనుమల నుంచి 250 నుంచి 300 టీఎంసీల వరకు నీరు సముద్రంలో కలుస్తోందని, అందులో నుంచి 25 టీఎంసీలను బయలు సీమ జిల్లాలకు అందిస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందన్నారు. అనంతరం నటులు యశ్, చిరంజీవి సర్జా, సాధుకోకిల, పూజాగాంధీ, రాగిణి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘటనల కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సినీ నటుల రాకతో కోలారు జనసంద్రమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు వారికి నీరాజనం పలికారు.