నష్టం మిగిల్చిన గాలీవాన
దొడ్డబళ్లాపురం: మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం, వీచిన పెనుగాలుల దెబ్బ నుంచితాలూకా జనం, రైతులు తేరుకోక ముందే మరో దెబ్బ తగిలింది. బుధవారం రాత్రి బలమైన ఈదురు గాలుల తో కూడిన భారీ వర్షం మరో విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అసలే అర్ధరాత్రి, ఆపై విద్యుత్ కూడా లేక పోవడంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికారు.
ఇస్లాంపురం, చైతన్య నగరం, సంజయ్ నగరం, వీరభధ్రన పాళ్యం తదితర ప్రాంతాల్లో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. దుకాణదారులు ఉదయం తలుపులు తెరిచే సరికి దుకాణాలన్నీ మురుగు కాలువలను తలపించాయి. పట్టణంలోని శివపురం గేట్ వద్ద అశ్వత్థకట్టపై ఉన్న రావి చెట్టు దేవాలయంపై కూలడంతో దేవాలయం కట్టడం పాక్షికంగా దెబ్బతింది. అశ్వత్థకట్ట వేళ్లతోపాటు పెకలించుకు వచ్చింది. పాల శీతల కేంద్రంలో భారీ వృక్షం పెద్ద బాయిలర్‌పై పడడంతో అది దెబ్బతింది. పలు చెట్లు కాంపౌండ్‌పై పడ్డాయి. కోర్టు ముందు కూడా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఎక్కడ చూసినా వందల కొద్దీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కేబుల్‌వైర్లు, విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి.
దీంతో గురువారం మధ్యాహ్నమైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. పలు సెల్ టవర్లలో సైతం విద్యుత్ లేక ఇంటర్నెట్, మొబైళ్లు మూగబోయాయి. తాలూకా పరిధిలో అనేక పంటలు నీట మునిగాయి. భారీ చెట్లు, మామిడి, జామ, ద్రాక్ష తదితర పంటలు సర్వనాశనమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కోళ్ల ఫారంలలోకి వరద నీరు చేరడంతో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. ఇక షీట్లు ఉన్న ఇళ్ల పైకప్పులు దూది పింజల్లా ఎగిరి పోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో షీట్లతో నిర్మించిన భోజనం తయారీ కట్టడాల పైకప్పులు కూడా ఎగిరి పోయాయి. మరి కొన్ని పాఠశాలల్లో వర్షపు నీరు చేరింది.