సొమ్ములుంటేనే..! | The state government's new health insurance scheme ' | Sakshi
Sakshi News home page

సొమ్ములుంటేనే..!

Published Sat, Nov 5 2016 2:00 AM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM

సొమ్ములుంటేనే..! - Sakshi

సొమ్ములుంటేనే..!

సర్కారు బీమా  ఆరోగ్యశ్రీకి క్రమంగా మంగళం పాడే కుట్ర

రాష్ర్ట ప్రభుత్వ కొత్త ఆరోగ్య బీమా ‘పథకం’!
ఏడాదికి రూ.1,200 కడితే అన్ని చికిత్సలు
కొత్త పథకానికి శరవేగంగా సన్నాహాలు
సొమ్ము కట్టినవారికే ప్రథమ సేవలు
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు అందని వైద్యం..
అందరినీ కొత్త స్కీమ్‌లోకి రప్పించడమే లక్ష్యం
 

సాక్షి, అమరావతి: పేదలకు వరప్రదాయిని వంటి ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు చెల్లించకుండా నిర్వీర్యం చేస్తూ వస్తున్న రాష్ర్టప్రభుత్వం తాజాగా ఓ కొత్త ఆరోగ్య బీమా పథకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కొక్కరు నెలకు రూ.100 కడితే ఆరోగ్యశ్రీ చికిత్సలన్నీ అందిస్తారని అధికారులు చెబుతున్నారు. అంటే ఏడాదికి రూ.1,200 చెల్లించాలన్నమాట. ఆరోగ్యశ్రీ చెల్లింపుల భారం నుంచి తప్పించుకోవడంతోపాటు ఉచితవైద్యం అందుకుంటున్న పేదలందరినీ క్రమంగా ఈ వందరూపాయల వైద్య బీమా పథకంలోకి తీసుకురావడం రాష్ర్టప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి బకాయిలు అందకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం నిరాకరిస్తున్నాయి.

ఈ వందరూపాయల వైద్య బీమా పథకంలో చేరే వారికి మాత్రం అన్ని ఆసుపత్రుల్లో చికిత్సలు సకాలంలో అందేలా అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. అంటే క్రమంగా ఆరోగ్యశ్రీ పేదలంతా ఈ వందరూపాయల వైద్య బీమా పథకంలో చేరితే మేలు అని అనుకునే పరిస్థితి తీసుకువస్తారన్నమాట. ప్రజారోగ్య బాధ్యతను గాలికొదిలేసి..అందరికీ ఉచితవైద్యం అందించాలన్న స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ పుట్టుకొస్తున్న ఈ పథకం అసలు లక్ష్యం మాత్రం ‘ఆరోగ్యశ్రీ’ని సమూలంగా సర్వనాశనం చేయడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇదీ వంద రూపాయల వైద్య పథకం..
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వారు ఒక్కొక్కరు నెలకు వంద రూపాయల చొప్పున కడితే ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని జబ్బులకు చికిత్సలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు. ప్రతినెలా రూ.100 చొప్పున చెల్లిస్తే ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ఇచ్చినట్టే ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తారు. ఈ కార్డులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళితే వైద్యం అందిస్తారు. కుటుంబంలో నలుగురు సభ్యులుంటే నెలకు రూ.400 చెల్లించాలి. అంటే సంవత్సరానికి రూ.4,800 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ స్కీమ్ కింద రూ. 100 చెల్లించే వ్యక్తికి ఎన్ని లక్షల బీమా ఇవ్వాలి? ఈ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలా లేక ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించాలా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి త్వరలోనే మార్గదర్శకాలు జారీచేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్న ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వారు చెబుతున్నారు.

అసలు లక్ష్యం ఆరోగ్యశ్రీనే...
వందరూపాయల వైద్య పథకం అసలు లక్ష్యం ఆరోగ్యశ్రీ పథకాన్ని సమూలంగా నాశనం చేయడమేనని అధికారులు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పథకంలో ఉన్న పేదలను క్రమంగా ఈ చెల్లింపుల పథకం కిందకు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అదెలాగంటే.. ఉదాహరణకు రూ.100 చెల్లించిన రోగి, ఆరోగ్యశ్రీ పథకంలోని పేద రోగి ఇద్దరూ ఒకేసారి ఆస్పత్రికి వస్తే వంద రూపాయలు చెల్లించిన రోగికి ముందుగా వైద్యానికి అనుమతులు లభిస్తాయి.

ఉచితంగా వెళ్లే వారికి జాప్యం జరుగుతుంది. వంద కడితే తొందరగా అనుమతులు వస్తున్నాయి కాబట్టి ఉచితంగా వెళ్లే ఆరోగ్యశ్రీ రోగి కూడా ఈ వంద రూపాయల వైద్య పథకంలోకి చేరిపోవాలని ఆలోచిస్తాడు. దీంతో ఒక్కొక్కరే ఉచితం వైపు నుంచి వంద రూపాయల పథకంలోకి మళ్లే అవకాశం ఉంటుందని సర్కారు ఆలోచన. అందులోనూ ప్రాణాపాయ జబ్బులతో వచ్చే రోగులు మరింత వేగంగా వైద్యం అందాలని చూస్తారు. అలాంటివారంతా ఆతృతగా వంద రూపాయల స్కీములోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

పేదల నుంచి వసూళ్ల కోసమే కొత్త స్కీమ్..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.30 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. సుమారు 4 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నారు. అంటే మిగిలిన వారు సుమారు కోటి మంది మాత్రమే. వీరిలో సంపన్న వర్గాలు, వ్యాపారులు, ఉద్యోగులు మినహాయిస్తే పేదలు తక్కువే. దానిని బట్టి వంద రూపాయల వైద్య పథకం లక్ష్యం ఆరోగ్యశ్రీ పేదలే అన్న విషయం బోదపడుతుందని అధికారులు అంటున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి సామాన్యుల నుంచి వసూళ్లు చేసేందుకే ప్రభుత్వం ఈ కొత్త స్కీమును తెరమీదకు తెస్తున్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి.

ఏటా వెయ్యి కోట్లు ఆరోగ్యశ్రీకి ఉచితంగా ఖర్చు చేయడం తీవ్ర భారంగా ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఆ పథకాన్ని ఎలాగోలా అటకెక్కించి నెలనెలా వసూళ్లు దండుకునేందుకు కొత్త వైద్య పథకాన్ని సిద్ధం చేస్తోందని అధికారులంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం.
 
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఇలా..
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,044 జబ్బులకు చికిత్సలు అందించాల్సి ఉంది. ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి రూ.2.50 లక్షల బీమా ఉంది. దీని ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరం ఆరోగ్యశ్రీ ట్రస్టుకు  రూ.910 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లే మంజూరు చేసింది. గత ఏడాది కూడా రూ.250 కోట్లు బకాయి పెండింగ్ ఉంది. ఆ రూ.250 కోట్లు తీసేస్తే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఈ ఏడాది చెల్లించింది రూ. 250 కోట్లేనన్నమాట. అంటే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఈ ఏడాది ఇంకా రూ.660 కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి.

అందుకే ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం చేయడం నిలిపేస్తున్నాయి. చాలా చోట్ల రోగులను తిప్పి పంపుతున్నాయి. రోజూ 2 వేల మందికి సర్జరీలు జరిగే పరిస్థితి నుంచి 200 సర్జరీలకు వైద్యం దిగజారిపోయింది. ప్రీఆథరైజేషన్ అనుమతులు భారీగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనాసరే ఆరోగ్యశ్రీ భారాన్ని వదిలించుకోవడం కోసం ప్రభుత్వం ఈ వందరూపాయల వైద్య బీమా పథకానికి సిద్ధమౌతున్నదని అధికారులంటున్నారు.
 
ఉద్యోగులు కట్టిన సొమ్ము ఏమైంది?
నగదు రహిత వైద్యం కోసం ఉద్యోగుల నుంచి కేడర్‌ను బట్టి కొందరి వద్ద నెలకు రూ.120, కొందరి నుంచి రూ.90 చొప్పున రెండేళ్లుగా ప్రభుత్వం వసూలు చేస్తోంది. రెండేళ్లలో సుమారు రూ. 250 కోట్లు పైనే ప్రభుత్వం వసూలు చేసింది. కానీ నగదు రహిత వైద్యం ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఆర్థిక శాఖ ఇప్పటి వరకూ ఉద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఇవ్వలేదు. పదే పదే ఈ నిధుల కోసం లేఖ రాసినా ఆర్థిక శాఖ స్పందించలేదు. దీంతో సర్కారు, ఆరోగ్యశ్రీల మధ్య ఉద్యోగులు, పెన్షనర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కట్టిన సొమ్మునే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఇవ్వకుండా, వైద్యం చేయించకుండా ఉన్న సర్కారు ఇక పేదల నుంచి రాబట్టే వందరూపాయల వైద్య బీమా సొమ్మును చెల్లిస్తుందా.. వైద్యం అందిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement