కృష్ణప్ప హఠాన్మరణం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ మంత్రి, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఏ. కృష్ణప్ప (68) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. స్థానిక కేఆర్ పురంలో నివాసం ఉంటున్న ఆయన సాయంత్రం పూట బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు. యధా ప్రకారం ఆడుతుండగా, హఠాత్తుగా కింద పడిపోయారు. వెంటనే సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తుమకూరు స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయావకాశాలున్నాయని అనుకుంటున్న తరుణంలో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన కృష్ణప్ప బెంగళూరులో బీ.కాం పూర్తి చేశారు. అనంతరం కేఆర్ పురంలోని ఐటీఐలో ఉద్యోగంలో చేరారు.
30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం..
కృష్ణప్ప తొలి నుంచీ కాంగ్రెస్ వాది. 30 ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. నాలుగు సార్లు వర్తూరు నియోజక వర్గం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. పశు సంవర్ధక, ఉద్యాన వనాలు, చక్కెర, సాంఘిక సంక్షేమ శాఖలను నిర్వహించారు. గత ఏడాది శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో చివరి నిముషంలో జేడీఎస్‌లో చేరారు. హిరియూరు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పరాజయం పాలవడంతో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని వదులుకున్న కుమారస్వామి స్థానంలో అధినేత దేవెగౌడ వెనుకబడిన వర్గాలకు చెందిన కృష్ణప్పను నియమించారు.