భయపెడుతున్న ఆయిల్‌ తెట్టు | Threatening Oil slag in chennei | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న ఆయిల్‌ తెట్టు

Published Sat, Feb 4 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

Threatening Oil slag in chennei

► 32 కిలోమీటర్లకు విస్తరించిన ఆయిల్‌తెట్టు
► 2వేల టన్నుల చేపల మృతి
► రెండు నౌకలపై కోస్ట్‌గార్డ్‌ కేసులు
► ఇరాక్‌ నౌకపై ఐదు సెక్షన్ల కేసు
► కేంద్ర బృందం రాక


రెండు నౌకలు ఢీకొనగా ఏర్పడిన ప్రమాదంతో బంగాళాఖాత సముద్ర జలాలను కలుషితం చేసిన క్రూడాయిల్‌ తీరప్రాంత ప్రజానీకాన్ని భయాందోళలకు గురిచేస్తోంది. సముద్రపు అలలపై సుమారు 32 కిలోమీటర్ల వరకు ఆయిల్‌తెట్టు విస్తరించడం ద్వారా తన విషపుకోరలను చాచింది. ఇంతటి ప్రమాదానికి కారణమైన రెండు నౌకలపై కోస్ట్‌గార్డ్‌ అధికారులు కేసులు పెట్టారు. అలాగే ఇరాక్‌కు చెందిన నౌకపై ఐదు సెక్షన్ల కింద మీంజూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై సమీపం ఎన్నూరులోని కామరాజర్‌ హార్బర్‌ నుంచి వెళుతున్న, ముంబై నుంచి వస్తున్న రెండు రవాణానౌకలు గత నెల 28వ తేదీన నడిసముద్రంలో ఢీకొన్న ప్రమాదం భారీస్థాయిలో సముద్ర జలాల కాలుష్యానికి కారణమైంది. ముంబై నుంచి హార్బర్‌కు వస్తున్న ‘ఎమ్‌డీ డాన్ ∙కాంచీపురం’ అనే క్రూడాయిల్‌ రవాణా నౌక, గ్యాస్‌ను దించి విశాఖపట్టణం వెళ్లేందుకు హార్బర్‌ నుంచి బయలుదేరిన నౌక ఢీకొనగా క్రూడాయిల్‌ ట్యాంక్‌ బద్దలై వేలాది లీటర్ల క్రూడాయిల్‌ సముద్రంలో లీకైంది. ప్రమాదం జరిగినపుడు పరిమిత ప్రాంతంలోని నీరుమాత్రమే చమురుతెట్టుగా మారిపోగా ఈ వారం రోజుల్లో కిలోమీటర్ల మేరకు విస్తరించి ప్రమాదతీవ్రతను పెంచింది. చెన్నై, ఎన్నూరు, తిరువొత్తియూరు, కాశిమేడు, మెరీనా, తిరువాన్మియూరులోని సుమారు 32 కిలోమీటర్ల దూరం సముద్రతీరమంతా నల్లని, చిక్కటి చమురుతెట్టుతో భయానకంగా మారిపోయింది.

శుక్రవారానికి ఆయిల్‌తెట్టు పాలవాక్కం వరకు వ్యాపించగా రాత్రి సమయానికి అంజుంబాక్కం వరకు విస్తరించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌తెట్టు వల్ల ఏర్పడిన ఘాటుకు సుమారు 2వేల టన్నుల చేపలు మృతి చెందాయి. పెద్ద సంఖ్యలో తాబేళ్ల మృతకళేబరాలు ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. సముద్రతీర గస్తీ దళాలు, హార్బర్‌ కార్మికులు, విద్యార్థులు, యువకులు వారంరోజులుగా కష్టిస్తున్నా సముద్ర జలాలు సాధారణ స్థితికి రాలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు ఇచ్చిన పిలుపునకు స్పందించి పెద్ద సంఖ్యలో యువకులు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారానికి ఏడురోజులు కాగా కోస్ట్‌గార్డుకు చెందిన హెలికాప్టర్‌కు ఆయిల్‌ స్కిమ్మర్‌ అనే పరికరాన్ని ఆమర్చి ఆయిల్‌తెట్టును సముద్రం మద్యలోని నీటి నుంచి తోడివేసేందుకు అవిశ్రాంతగా శ్రమిస్తూనే ఉన్నారు.

మరోవైపు సముద్రతీరంలోని అయిల్‌తెట్టును మోటార్లతో తోడుతున్నారు.వారంరోజుల్లో 104 టన్నుల ఆయిల్‌తెట్టును తోడివేయగా ఇంకా 20 టన్నుల అయిల్‌ నీటిలో ఉందని చెబుతున్నారు. ప్రమాదకరమైన కాలుష్యవాతావరణం వల్ల మత్స్యకారులు వారంరోజులుగా చేపలవేటకు వెళ్లలేదు. తీర ప్రాంతాల్లో ప్రజలు సైతం కాలుష్యాన్ని భరించలేక అల్లాడుతున్నారు. ఘాయిల్‌తెట్టును తొలగించేందుకు మరో వారం రోజులు పడతుందని, సముద్రం సాధారణ స్థితికి చేరుకునేందుకు ఆరునెలలు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయిల్‌తెట్టును తొలగించే పనులు శనివారంతో పూర్తవుతాయని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ సుందరవల్లి ధీమా వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ శుక్రవారం సముద్రతీర ప్రాంతాల్లో పర్యటించారు.

ఐదు సెక్షన్లపై కేసు:  గ్యాస్‌ లోడుతో ప్రమాదానికి కారణమైన ఇరాక్‌ దేశానికి చెందిన ఎండీ మాబిల్‌ నౌకాయాన సంస్థపై కామరాజర్‌ హార్బర్‌ జనరల్‌ మేనేజర్‌ గుప్త మీంజూరు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  ఐదు సెక్షన్ల కింద పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అలాగే ప్రమాదంలో చిక్కుకున్న రెండు నౌకలపైనా కోస్ట్‌గార్డ్‌ అధికారులు కేసులు పెట్ట్డి అదుపులోకి తీసుకున్నారు. హార్బర్‌ అధికారుల జాప్యం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని నౌకల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం చోటుచేసుకోగానే లీకవుతున్న ఆయిల్‌ను అరికట్టేందుకు హార్బర్‌లోకి అనుమతించాల్సిందిగా తాము కోరామాని తెలిపారు.

అయితే రెండు రోజుల వరకు హార్బర్‌ అధికారులు స్పందిచంకపోవడంతో అధికశాతం అయిల్‌ సముద్రంలో కలిసిపోయిందని నౌకల యాజమాన్యాలు ఫిర్యాదు చేస్తున్నాయి. అయితే నౌకలను హార్బర్‌లోకి అనుమతించేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయని, వెంటనే వీలు కాదంటూ నౌకల యాజమాన్యాలన ఆరోపణలను హార్బర్‌ అధికారులు కొట్టిపారేశారు.

కేంద్ర బృందం రాక: సముద్రంలో క్రూడాయిల్‌ కలిసి పోయిన విషయంలో ఆరంభంలో హార్బర్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నౌకలు ఢీకొన్నా జలాల్లో ఆయిల్‌ కలవలేదని అధికారులు బుకాయించారు. అయితే రోజులు గడిచేకొద్దీ సముద్ర జలాలు నల్లగా మారిపోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపేందుకు, పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పర్యావరణశాఖకు చెందిన అధికారుల బృందం శుక్రవారం చెన్నైకి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన ముప్పు: ప్రస్తుతం బంగాళాఖాతంలో గాలి దక్షిణం నుంచి పశ్చిమ దిశగా వీస్తున్న కారణంగా సముద్రంలోని అలలు సైతం పశ్చిమ దిశగా పరుగుపెడుతున్నాయి. దీంతో అయిల్‌తెట్టు ఉత్తరం వైపు పయనించకుండా దక్షిణం వైపుకు విస్తరిస్తోంది. సముద్రపు గాలుల దిశ పుణ్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అయిల్‌తెట్టు ముప్పు తప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement