Oil slag
-
తెట్టు తిప్పలు!
► నేతల పడగ ► వంద టన్నులు తొలగింపు ► పీఆర్కే పరిశీలన ► కెప్టెన్ల వద్ద విచారణ సాక్షి, చెన్నై: ఆయిల్ తెట్టు అధికార వర్గాల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. క్రమంగా చెన్నై సముద్ర తీరం తెట్టుతో కలుషితం అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నేతలు తీరం వెంబడి పర్యటించారు. పనుల వేగం పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఎన్నూరు పరిసరాల్లో పర్యటించారు. ఎన్నూర్ కామరాజర్ హార్బర్‌కు కూత వేటు దూరంలో సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న విషయం తెలిసిందే. క్రూడాయిల్‌తో వచ్చిన నౌకలో ఏర్పడ్డ లీకేజీ చెన్నై సముద్ర తీరాన్ని కలుషితం చేసింది. క్రూడాయిల్ సముద్రంలో కలవడంతో తీరం రంగు మారింది. జల సంపద మీద ప్రభావం, తీరం కలుషిత ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన బయలు దేరింది. ఎనిమిదో రోజుగా సముద్రం నుంచి ఆయిల్ తెట్టును తొలగించే పనులు శర వేగంగా శనివారం కూడా సాగాయి. తొలగించే కొద్దీ తెట్టు తీవ్రత పెరుగుతుండడంతో ఈ కలుషితం ఎలాంటి కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన తీరవాసుల్లో, జాలర్ల కుటుంబాల్లో బయలుదేరింది. కోస్టుగార్డు, రెవెన్యూ, కేంద్ర ప్రభుత్వ, హార్బర్వర్గాలు ఈ తెట్టుతో ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంద టన్నులు : శనివారం నాటికి వంద టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బకెట్లతో సిబ్బంది, సూపర్ సక్కింగ్ పరికరంతో శరవేగంగా తెట్టు తొలగింపు సాగుతున్నట్టు వివరించారు. సూపర్ సక్కింగ్ పరికరంతో రెండు రోజుల్లో 54 టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు, ఇందులో నీళ్లు సైతం కలిసి ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఎన్నూర్ పరిసరాల్లో 21 టన్నులు, ఆర్కే నగర్లో 3.4 టన్నులు, మెరీనాతీరంలో ఏడు టన్నులు, శక్తి నగర్, గాంధీనగర్‌లలో ఐదు టన్నుల మేరకు అత్యధికంగా తెట్టు తొలగింపు సాగింది. కెప్టెన్ల వద్ద విచారణ : కామరాజర్ హార్బర్ అధికారి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో మీంజూరు పోలీసులు రంగంలోకి దిగారు. 336, 427, 431, 250, 285 సెక్షన్ల కింద కేసుల నమోదుతో హార్బర్లో ఉన్న రెండు నౌకల కెప్టెన్ల వద్ద తీవ్రంగా విచారణ సాగిస్తున్నారు. రెండు నౌకలు ఢీకొనాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగుతోంది. పీఆర్కే పరిశీలన : కేంద్ర రహదారులు, రోడ్డు , రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తిరువొత్తియూరు, ఎన్నూరు పరిసరాల్లో తీరం వెంబడి సాగుతున్న తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నౌకలు ఢీకొన్న సమాచారంతో తక్షణ పరిశీలన సాగిందని, అయితే, ఎలాంటి లీకేజీ తొలుత కనిపించక పోవడంతో పెద్దగా ముప్పు ఉండదని భావించామన్నారు. ఆ నౌకలో 58 వేల టన్నుల మేరకు చమురు ఉన్నట్టు, దానిని దిగుమతి చేసే పనుల వేగం శరవేగంగా సాగుతోందన్నారు. నౌక ఇంజిన్ ఆగడంతోనే లీకేజీని గుర్తించామని, ఒక వేళ నౌకలో చీలిక ఏర్పడి ఉంటే, భారీ ముప్పును చవి చూసి ఉండాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెట్టు తొలగింపునకు తగ్గ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, త్వరితగతిన తొలగిస్తామన్నారు. హార్బర్లో ఉన్న నౌకలను పరిశీలించినానంతరం నష్టం తీవ్రతను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమకు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల తీరంలోని జాలర్ల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. స్టాలిన్, కనిమొళిల పరిశీలన : డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నాయకులు సముద్ర తీరంలో పర్యటించారు. తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. తిరువొత్తియూరు, భారతీనగర్ పరిసరాల్లో స్టాలిన్ పర్యటించి, అక్కడి జాలర్లతో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ 32 కిమీ మేరకు తెట్టు విస్తరించే వరకు అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండడం శోచనీయమన్నారు. సంబంధిత మంత్రి ఆలస్యంగా తీరానికి పరుగులు పెట్టారని పేర్కొంటూ, ఇకనైనా పనుల్నిమరింత వేగవంతం చేయించాలన్నారు. ఈ తెట్టు రూపంలో చెన్నైకు నీటిని అందిస్తున్న మీంజూరు నిర్లవణీకరణ పథకంకు ఎలాంటి ఇబ్బందులు నెలకొననున్నాయోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిపుణుల్ని రంగంలోకి దించాలని, అత్యాధునిక పరికరాలను మరింతగా ఉపయోగించాలని, లేని పక్షంలో మరింత ఆందోళన తప్పదేమోనని పేర్కొన్నారు. ఇక, డీఎంకే ఎంపీ కనిమొళి ఎన్నూరు పరిసరాల్లో పర్యటించి, అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులు లేకుండా, సాధారణ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ జాలర్ల గ్రామాల్లో పర్యటించి, తెట్టు రూపంలో పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. -
భయపెడుతున్న ఆయిల్ తెట్టు
► 32 కిలోమీటర్లకు విస్తరించిన ఆయిల్‌తెట్టు ► 2వేల టన్నుల చేపల మృతి ► రెండు నౌకలపై కోస్ట్‌గార్డ్ కేసులు ► ఇరాక్ నౌకపై ఐదు సెక్షన్ల కేసు ► కేంద్ర బృందం రాక రెండు నౌకలు ఢీకొనగా ఏర్పడిన ప్రమాదంతో బంగాళాఖాత సముద్ర జలాలను కలుషితం చేసిన క్రూడాయిల్ తీరప్రాంత ప్రజానీకాన్ని భయాందోళలకు గురిచేస్తోంది. సముద్రపు అలలపై సుమారు 32 కిలోమీటర్ల వరకు ఆయిల్‌తెట్టు విస్తరించడం ద్వారా తన విషపుకోరలను చాచింది. ఇంతటి ప్రమాదానికి కారణమైన రెండు నౌకలపై కోస్ట్‌గార్డ్ అధికారులు కేసులు పెట్టారు. అలాగే ఇరాక్‌కు చెందిన నౌకపై ఐదు సెక్షన్ల కింద మీంజూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై సమీపం ఎన్నూరులోని కామరాజర్ హార్బర్ నుంచి వెళుతున్న, ముంబై నుంచి వస్తున్న రెండు రవాణానౌకలు గత నెల 28వ తేదీన నడిసముద్రంలో ఢీకొన్న ప్రమాదం భారీస్థాయిలో సముద్ర జలాల కాలుష్యానికి కారణమైంది. ముంబై నుంచి హార్బర్‌కు వస్తున్న ‘ఎమ్డీ డాన్ ∙కాంచీపురం’ అనే క్రూడాయిల్ రవాణా నౌక, గ్యాస్‌ను దించి విశాఖపట్టణం వెళ్లేందుకు హార్బర్ నుంచి బయలుదేరిన నౌక ఢీకొనగా క్రూడాయిల్ ట్యాంక్ బద్దలై వేలాది లీటర్ల క్రూడాయిల్ సముద్రంలో లీకైంది. ప్రమాదం జరిగినపుడు పరిమిత ప్రాంతంలోని నీరుమాత్రమే చమురుతెట్టుగా మారిపోగా ఈ వారం రోజుల్లో కిలోమీటర్ల మేరకు విస్తరించి ప్రమాదతీవ్రతను పెంచింది. చెన్నై, ఎన్నూరు, తిరువొత్తియూరు, కాశిమేడు, మెరీనా, తిరువాన్మియూరులోని సుమారు 32 కిలోమీటర్ల దూరం సముద్రతీరమంతా నల్లని, చిక్కటి చమురుతెట్టుతో భయానకంగా మారిపోయింది. శుక్రవారానికి ఆయిల్‌తెట్టు పాలవాక్కం వరకు వ్యాపించగా రాత్రి సమయానికి అంజుంబాక్కం వరకు విస్తరించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌తెట్టు వల్ల ఏర్పడిన ఘాటుకు సుమారు 2వేల టన్నుల చేపలు మృతి చెందాయి. పెద్ద సంఖ్యలో తాబేళ్ల మృతకళేబరాలు ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. సముద్రతీర గస్తీ దళాలు, హార్బర్ కార్మికులు, విద్యార్థులు, యువకులు వారంరోజులుగా కష్టిస్తున్నా సముద్ర జలాలు సాధారణ స్థితికి రాలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు ఇచ్చిన పిలుపునకు స్పందించి పెద్ద సంఖ్యలో యువకులు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారానికి ఏడురోజులు కాగా కోస్ట్‌గార్డుకు చెందిన హెలికాప్టర్‌కు ఆయిల్ స్కిమ్మర్ అనే పరికరాన్ని ఆమర్చి ఆయిల్‌తెట్టును సముద్రం మద్యలోని నీటి నుంచి తోడివేసేందుకు అవిశ్రాంతగా శ్రమిస్తూనే ఉన్నారు. మరోవైపు సముద్రతీరంలోని అయిల్తెట్టును మోటార్లతో తోడుతున్నారు.వారంరోజుల్లో 104 టన్నుల ఆయిల్‌తెట్టును తోడివేయగా ఇంకా 20 టన్నుల అయిల్ నీటిలో ఉందని చెబుతున్నారు. ప్రమాదకరమైన కాలుష్యవాతావరణం వల్ల మత్స్యకారులు వారంరోజులుగా చేపలవేటకు వెళ్లలేదు. తీర ప్రాంతాల్లో ప్రజలు సైతం కాలుష్యాన్ని భరించలేక అల్లాడుతున్నారు. ఘాయిల్తెట్టును తొలగించేందుకు మరో వారం రోజులు పడతుందని, సముద్రం సాధారణ స్థితికి చేరుకునేందుకు ఆరునెలలు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయిల్‌తెట్టును తొలగించే పనులు శనివారంతో పూర్తవుతాయని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ సుందరవల్లి ధీమా వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ శుక్రవారం సముద్రతీర ప్రాంతాల్లో పర్యటించారు. ఐదు సెక్షన్లపై కేసు: గ్యాస్ లోడుతో ప్రమాదానికి కారణమైన ఇరాక్ దేశానికి చెందిన ఎండీ మాబిల్ నౌకాయాన సంస్థపై కామరాజర్ హార్బర్ జనరల్ మేనేజర్ గుప్త మీంజూరు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఐదు సెక్షన్ల కింద పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అలాగే ప్రమాదంలో చిక్కుకున్న రెండు నౌకలపైనా కోస్ట్‌గార్డ్ అధికారులు కేసులు పెట్ట్డి అదుపులోకి తీసుకున్నారు. హార్బర్ అధికారుల జాప్యం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని నౌకల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం చోటుచేసుకోగానే లీకవుతున్న ఆయిల్‌ను అరికట్టేందుకు హార్బర్లోకి అనుమతించాల్సిందిగా తాము కోరామాని తెలిపారు. అయితే రెండు రోజుల వరకు హార్బర్ అధికారులు స్పందిచంకపోవడంతో అధికశాతం అయిల్ సముద్రంలో కలిసిపోయిందని నౌకల యాజమాన్యాలు ఫిర్యాదు చేస్తున్నాయి. అయితే నౌకలను హార్బర్లోకి అనుమతించేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయని, వెంటనే వీలు కాదంటూ నౌకల యాజమాన్యాలన ఆరోపణలను హార్బర్ అధికారులు కొట్టిపారేశారు. కేంద్ర బృందం రాక: సముద్రంలో క్రూడాయిల్ కలిసి పోయిన విషయంలో ఆరంభంలో హార్బర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నౌకలు ఢీకొన్నా జలాల్లో ఆయిల్ కలవలేదని అధికారులు బుకాయించారు. అయితే రోజులు గడిచేకొద్దీ సముద్ర జలాలు నల్లగా మారిపోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపేందుకు, పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పర్యావరణశాఖకు చెందిన అధికారుల బృందం శుక్రవారం చెన్నైకి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన ముప్పు: ప్రస్తుతం బంగాళాఖాతంలో గాలి దక్షిణం నుంచి పశ్చిమ దిశగా వీస్తున్న కారణంగా సముద్రంలోని అలలు సైతం పశ్చిమ దిశగా పరుగుపెడుతున్నాయి. దీంతో అయిల్తెట్టు ఉత్తరం వైపు పయనించకుండా దక్షిణం వైపుకు విస్తరిస్తోంది. సముద్రపు గాలుల దిశ పుణ్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అయిల్తెట్టు ముప్పు తప్పింది. -
కొనసాగుతున్న చమురు తెట్టు తొలగింపు పనులు
పొన్నేరి: సముద్రతీరంలోని చమురు తెట్టు తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల తీరును తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎ.సుందరవల్లి, రెండురోజులుగా అక్కడే ఉండి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. చెన్నై శివారులోని ఎన్నూర్ కామరాజర్ నౌకాశ్రయం సమీపంలో రెండు భారీ నౌకలు ఢీకొన్న సంగతి తెలిసిందే. దీంతో నౌకల్లోని చమురు ట్యాంకర్లు పగిలిపోవడంతో చమురు మొత్తం సముద్రంలో కలిసింది. దీంతో అక్కడ నీరు మొత్తం కలుషితమైంది. దీంతో సముద్రంలోని చేపలు, తాబేళ్లు పెద్దసంఖ్యలో మృతిచెందాయి. అలాగే సముద్ర తీరంలోకి చమురు తెట్టు కొట్టుకుని వచ్చింది. దీంతో ఆ నీరు తాకిన వారికి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జాలర్లు నాలుగు రోజులుగా చేపలవేటకు పోవడం లేదు. దీంతో వారు పస్తులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. చమురుతెట్టు ఎన్నూర్, కాశిమేడులకు ఎక్కవగా చేరింది. దీంతో చమురు తెట్టు తమకు అంటుకుంటే చర్మవ్యాధులు వస్తాయని జాలర్లు ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. కోస్టుగార్డులు రంగంలోకి దిగి స్విమ్మర్లు, యంత్రాలతో చమురు తెట్టును తొలగిస్తున్నారు. వీరితోపాటు అగ్నిమాపక దళ సిబ్బంది, మద్రాస్ పోర్టు ట్రస్టు సిబ్బం ది, ఎన్నూర్ పోర్టు ఉద్యోగులు, రాష్ట్ర రహదారుల శాఖ ఆదాని పోర్టు, ఐవోసీ, చెన్నై మెట్రోవాటర్, తిరువళ్లూరు జిల్లా రెవెన్యూ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు మొత్తం 1,100 మందికిపైగా సిబ్బంది వచ్చి చమురుతెట్టును తొలగిస్తున్నారు. అయితే ఇప్పటికీ దాదాపు 44 టన్నుల మేరకు నూనె ని ల్వలు, 29 టన్నుల ఆయిల్ నీటి మిశ్రమాలను తొలగించినట్టు కలెక్టర్ సుందరవల్లి పేర్కొన్నారు. అలాగే సముద్రపునీరు కలుషితం కావడంతో అక్కడ పట్టే చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రజల్లోకి ఒక వార్త వెళ్లడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, మంత్రి బెంజిమెన్ ఎన్నూర్, కుప్పాలలో పర్యటించి జాలర్లతో మాట్లాడి వారి సమక్షంలోనే చేపల వంటతో సహపంక్తి భోజనం చేశారు.ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ చమురుతెట్టు వలన సముద్రతీరంలో దుర్గంధం వస్తుందని దీంతో బీచ్‌కు సరిగ్గా జనం రావడం లేదని చెప్పారు. అధికారులు చమురుతెట్టు తొలగింపు పనులను సాధ్యమైనంత త్వరగా చేయాలని కోరా రు. ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రులతో పాటు పొన్నేరి ఎమ్మెల్యే బలరామన్ ఉన్నారు.