న్యూఢిల్లీ: ‘గౌరవ్ గుప్తా ఒక బ్యాంక్ ఉద్యోగి.. మధ్యాహ్నం ఒక ఎయిర్ కండిషనింగ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.. వెయిటర్ వచ్చి వినయంగా అభివాదం చేసి ఏంకావాలో ప్రశ్నించాడు.. ఆయన ‘తాలి’ ఆర్డర్ ఇచ్చారు.. పదినిమిషాల్లో రోటీ, అన్నం,రెండు కూరలు, చెట్నీ, పెరుగు తో కూడిన భోజనాన్ని వెయిటర్ తీసుకువచ్చి గుప్తా ముందుంచాడు..’ ఇదంతా చదవడానికి సాదాసీదాగా ఉందికదూ.. కాని ఆ వెయిటర్ ఎవరో తెలుసా.. తీహార్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన నేరస్తుడు..ఇప్పుడర్థమైందా ఆ హోటల్ ప్రత్యేకత.. ఇందులో క్లీనింగ్ నుంచి కుకింగ్ వరకూ అన్ని పనులూ ఖైదీలే నిర్వహిస్తున్నారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఖైదీలకు పునరావాసం కల్పించే దిశలో జైలు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ‘తీహార్ ఫుడ్ కోర్ట్’ను జూలై మొదటి వారంలో ప్రారంభించారు. ఇది తీహార్ జైలులోని ఖైదీల విడిదికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే ఉంది.
ఈ హోటల్‌లో మొత్తం ఫర్నిచర్‌ను ఖైదీలో తయారుచేశారు. 50 మంది ఒకేసారి కూర్చోగలిగేంత విస్తీర్ణం ఉన్న ఈ హోటల్‌లో ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే.. హోటల్‌కు వచ్చిన వినియోగదారులతో ఎలా మసులుకోవాలనే విషయమై వెయిటర్లకు జైలుకు దగ్గర్లోనే ఉన్న ఒక హోటల్ మేనేజమెంట్ స్కూల్ శిక్షణ ఇచ్చింది. ఇక్కడ ఎక్కువగా ఉత్తర భారత దేశానికి చెందిన ఆహారమే దొరుకుతుంది. రూ.150కు డీలక్స్ తాలి దొరుకుతుండగా, అతి చౌకగా సమోసాలు కేవలం రూ.10కు ఇక్కడ లభ్యమవుతాయి. ఈ హోటల్ మేనేజర్ మహమ్మద్ అసిమ్ మాట్లాడుతూ రోజూ ఇక్కడ 50 మంది వరకు వినియోగదారులు వస్తుంటారన్నారు.
ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి రోజుకు రూ.74 లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి తమ హోటల్‌కు వచ్చి భోజనం చేసిన కస్టమర్ మళ్లీ భోజనానికి రావాల్సిందే..’ అంటూ అసిమ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ అసిమ్ ఒక హత్య కేసులో తీహార్ జైలులోనే 14 ఏళ్ల 6 నెలలపాటు శిక్షను అనుభవించాడు. కనీసం హైస్కూలు చదివి, 12 శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నవారెవరైనా ఈ హోటల్‌లో పనిచేసేందుకు అర్హులే. పారిపోవడానికి అంతగా ఆసక్తి చూపించరని ఇంకా రెండేళ్లలోపు శిక్షా కాలం ఉన్నవారికే ఈ హోటల్‌లో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. వారికి మరింత నమ్మకం కలిగించేందుకు ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా జైలు నుంచి సైకిల్ పైనైనా, లేదా నడుచుకుంటూ హోటల్‌కు వెళ్లేందుకు జైలు అధికారులు ఏర్పాటుచేశారు.
ఇదిలా ఉండగా వీరి సేవలపై కస్టమర్ల అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
‘భోజనం మామూలుగానే ఉంది.. అయితే అక్కడ వెయిటర్ ప్రవర్తన, వారు కస్టమర్లకు ఇస్తున్న మర్యాద, పరిశుభ్రత నిర్వహణ చాలా బాగున్నాయి..’ అంటూ గుప్తా తన కామెంట్ రాశారు. ‘భోజనం చాలా బాగుంది.. హోటల్‌ను వంద శాతం శుభ్రంగా ఉంచారు.. వెయిటర్ మర్యాదకరంగా మెసలుకుంటున్నారు. మెనూలో మరిన్ని వెరైటీలు పెడితే ఇంకా బాగుంటుంది..’ అని భూమికా దాబాస్ తన వ్యాఖ్యలో పేర్కొన్నారు. లాభాపేక్షలేని ఈ హోటల్‌లో తాజ్ బ్రాండ్ భోజనాన్ని ఖైదీలు అందజేస్తున్నారని తీహార్ జైలు ప్రతినిధి సునీల్ గుప్తా తెలిపారు. ఈ జైలులో 13,552 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కరడుగట్టిన వారే. అధికశాతం జీవిత ఖైదును అనుభవిస్తున్నవారే. వీరిలో మానసిక పరివర్తన కలిగించేందుకు జైలు ప్రాంగణంలో పలు వృత్తినైపుణ్య కోర్సులు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్లు గుప్తా వివరించారు. జైలులో చేపడుతున్న సంస్కరణలు, వాటి ఫలాలను బయట ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటుచేసి అందులో ఖైదీలనే సిబ్బందిగా నియమించామని గుప్తా తెలిపారు.
ఇటువంటి ప్రయోగం రెండేళ్లుగా కేరళలో చేపడుతున్నారని, అక్కడ మంచి ఫలితాలు సాధించడంతో తీహార్ జైలులో దాన్ని ఆచరిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు స్వయంగా ఉపాధిని పొందేందుకు వీలుగా ఈ శిక్షణ కార్యక్రమాలను చేపట్టామని ఆయన వివరించారు. ‘పలువురు ఖైదీలను దగ్గరగా గమనించిన అధికారులు, వారిలో మానసిక పరివర్తన సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే బయట ప్రపంచానికి దగ్గరగా తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం చేస్తున్నారని నాకనిపించింది..
ఏదేమైనా ఈ హోటల్‌లో పనిచేస్తోంది కరడుగట్టిన నేరస్తులేనా అని వారి ప్రవర్తన చూశాక మనకు అనిపించకమానదు.. అధికారులు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనిస్తుందనే ఆశిద్దాం..’ అంటూ ఈ హోటల్‌కు మొదటిసారి తినడానికి వచ్చిన అతుల్‌సింగ్ అనే వ్యక్తి వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఇందులో వెయిటర్‌గా పనిచేస్తున్న బాల్ కిషన్ గ్రోవర్ (49) మాట్లాడుతూ తాను క్షణికావేశంలో చేసిన హత్య కేసులో 13 యేళ్లుగాతీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నానని తెలిపాడు. ఇక్కడికి రాకముందు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడినని, విడుదలై వెళ్లిన తర్వాత తీహార్ రెస్టారెంట్‌కు అనుబంధంగా ఒక శాఖను ఏర్పాటుచేస్తానని ధీమాగా చెప్పాడు.
‘పాషాణం’ కరిగిన వేళ..
Published Mon, Aug 4 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement