
వారాంతపు విషాదం
సాక్షి, చెన్నై : వారాంతపు సరదాకు ముగ్గురు ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు బలి అయ్యారు. అద్దె కారును అతి వేగంగా నడిపి చెట్టుకు ఢీ కొట్టారు. సంఘటన స్థలంలో ఇద్దరు, ఆసుపత్రిలో మరొకరు మరణించారు. యువతితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులందరూ ఉత్తరాది వాసులు.
అతి వేగానికి బలి : జాతీయ రహదారిలోని చెంగల్పట్టు నుంచి కాటాన్ కొళత్తూరు వైపుగా ఉదయం అతి వేగంగా దూసుకొచ్చిన కారు క్షణాల్లో అదుపు తప్పింది. రోడ్డు పక్కగా ఉన్న చింత చెట్టును ఢీకొట్టి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మీదుగా టేక్ డైవర్షన్ తీసుకుంది. చెట్టును ఢీకొన్న క్షణాల్లోనే కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన పరిసర వాసులు పరుగులు తీశారు. అప్పటికే ఇద్దరు విగత జీవులు కావడం, ఓ యువతితో పాటు మరో ముగ్గురు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండటంతో హుటా హుటీన ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న చెంగల్పట్టు డీఎస్పీ ముగిలన్ నేతృత్వంలో పోలీసు బృందాలు పరుగులు తీశాయి. మృతుల వివ రాల సేకరణలో పడ్డారు. విచారణలో ఆ కారు అద్దెకు తీసుకుని ఉన్నట్టు తేలింది. అక్కడ సేకరించిన సమాచారంతో అందులో ఉన్న వాళ్లందరూ ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులుగా తేలింది. కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు మరణించడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
వారాంతపు సరదా: మృతుల్ని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నీల్ కొండల్(19), ఢిల్లీకి చెందిన సమర సింహా(19), పాట్నాకు చెందిన సుభం సింగ్(19)గా గుర్తించారు. గాయపడ్డ వారిలో పాట్నాకు చెందిన సిద్ధార్త్‌నాథ్ సింగ్, నీలు, శివంజీ ఉన్నారు. ఈ ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. పన్నెండో స్నాతకోత్సవం జరుపుకుంటున్న సమయంలో తమ వర్సిటీ విద్యార్థులు ప్రమాదం రూపంలో మరణించిన సమాచారం ఆ వర్సిటీ వర్గాల్ని విషాదంలోకి నెట్టింది. ఆ విద్యార్థుల సహచరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఆయా కుటుంబాలకు సమాచారం అందించారు. కాగా, వీక్ ఎండ్ శనివారం అయినప్పటికీ, విద్యార్థులు పయనించిన కారు చెంగల్పట్టు వైపు నుంచి కాటాన్ కొళత్తూరు వైపుగా ఎందుకు వచ్చిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ముందు రోజే హాస్టల్ నుంచి బయటకు వెళ్లారా..? లేదా, అద్దె కారును తీసుకుని విహార కేంద్రాలకు వెళ్లారా..? డ్రైవింగ్ పేరుతో దూసుకెళ్లారా..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇక, ఆ కారులు ఐదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థిని ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేసే వాళ్లూ ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిలో గంట పాటుగా వాహనాల రాక పోకలకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు.
మరో ప్రమాదం: సెయింట్‌థామస్ మౌంట్ బట్ రోడ్డుకు చెందిన కవిన్ షోళింగనల్లూరులోని ఓ సంస్థలో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి పని ముగించుకుని వేళచ్చేరి వైపుగా ఇంటికి మోటారు సైకిల్‌పై బయలు దేరారు. మార్గమధ్యలోవెనుక వైపుగాఅతి వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ లారీని ఢీ కొంది. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మార్గ మధ్యలో మరణించాడు. వాటార్ ట్యాంకర్ ఢీకొని ముగ్గురు విద్యార్థినులు గిండిలో బలైన సంఘటన మరువక ముందే, మరో ట్యాంకర్ రూపంలో కవిన్ విగత జీవిగా మారడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది.