• సంక్రాంతికి జల్లికట్టు నిర్వహిస్తాం
• ఎంపీగా ఇలగణేషన్ తొలి హామీ
• స్పష్టం చేసిన పీఆర్‌కే
సాక్షి, చెన్నై: సంక్రాంతి పర్వదినాన్ని జల్లికట్టుతో శ్రీకారం చుట్టి తీరుతామని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ఇలగణేషన్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిపలుకుగాతొలిపలుకు..జల్లికట్టు నినాదాన్ని ఇలగణేషన్ అందుకున్నారు. తమిళుల వీరత్వాన్ని చాటే సాహస క్రీడ జల్లికట్టుకు జంతు ప్రేమికుల రూపంలో బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. ఈ క్రీడను పునరుద్ధరించేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి సాగుతూ వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం వేళ ఊరించినట్టు ఊరించి చివరకు కమలనాథులు నిరాశను తమిళులకు మిగిల్చారు.
రానున్న సంక్రాంతి పర్వదినంలోపు జల్లికట్టు అనుమతికి తగ్గ చర్యలు వేగవంతం చేయాలని క్రీడాకారులు, నిర్వాహకులు, తమిళాభిమాన సంఘాలు, రాజకీయపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ సారి కచ్చితంగా జల్లికట్టుకు అనుమతి ఉంటుందన్న భరోసాను రాష్ట్రానికి చెందిన ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ర్టం నుంచి మరో ఎంపీ ఢిల్లీకి వెళ్లడంతో ఆయన సైతం అదే నినాదంతో ముందుకు సాగేందుకు నిర్ణయించడం ఆహ్వానించ దగ్గ విషయమే.
జల్లికట్టు షురూ: పదవి కోసం చాలా కాలం ఎదురు చూసి చివరకు, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఎంపీగా శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ర్టపతి హమీద్ అన్సారి, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌ల సమక్షంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఇలగణేషన్‌కు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పొన్‌రాధాకృష్ణన్, ఎస్‌ఎస్ అహ్లూవాలియా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారంతో బయటకు అడుగులు పెట్టిన ఇలగణేషన్ మీడియాతో మాట్లాడుతూ తొలి పలుకుగా జల్లికట్టు అనుమతి లక్ష్యంగా తన పయనం సాగుతుందని ప్రకటించారు.
జల్లికట్టు అనుమతికి తగ్గ కసరత్తుల్ని సంబంధిత శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వేగవంతం చేసి ఉన్నారని, రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్టు, 2017 సంక్రాంతి పర్వదినాన్ని జల్లికట్టుతో శ్రీకారం చుట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్ తన గళాన్ని కలుపుతూ ఇలగణేషన్ చెప్పినట్టుగా ఈ ఏడాది జల్లికట్టుకు అనుమతి తథ్యం అని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవదీయాడానికి తగ్గ చర్యల్లో ఉన్నామన్నారు. వీరి ప్రకటనతో జల్లికట్టు మద్దతుదారుల్లో ఆనందం వికసించినా, ఆచరణలో పెట్టేనా, గతంలో వలే భరోసాతో చివరకు నిరాశను మిగుల్చుతారా అన్న అనుమానాలు బయలు దేరాయి.
తొలిపలుకు..
Published Sat, Oct 15 2016 1:32 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement