
సక్సేనా అవుట్?
సాక్షి, చెన్నై : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సందీప్ సక్సేనా బదిలీ సచివాలయంలో చర్చకు దారితీసింది. ఆయన్ను హఠాత్తుగా ఢిల్లీకి బదిలీ చేశారంటూ సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తనకు ఎలాంటి సమాచారం లేదని సక్సేనా స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఇదివరకు పనిచేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను తనను బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు విముక్తి కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 27న అప్పటి వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉన్న సందీప్ సక్సేనాను నియమించారు. సక్సేనా బాధ్యతలు చేపట్టినానంతరం శ్రీరంగం, ఆర్‌కే నగర్ ఉప ఎన్నికలు జరిగాయి.
ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తుల్లో సక్సేనా బిజీగానే ఉన్నారు. అదే సమయయంలో ఈ ఏడాది కాలంలో సందీప్ సక్సేనా పనితీరుపై ప్రతి పక్షాలు తీవ్రంగా దుయ్యబడుతూ వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ప్రతి పక్షాల మద్దతుదారుల ఓట్ల గల్లంతు వివాదానికి దారితీసింది. ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంక్ మీద ప్రభావం చూపించే రీతిలో ఆ జాబితా ఉండడంతో ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సక్సేనా అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బయలుదేరాయి. ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించేందుకు వీలులేదని, బదిలీ చేసి మరొకర్ని నియమించాల్సిందేన న్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. సక్సేనాపై వచ్చిన ఫిర్యాదుల్ని కేంద్రం ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకునట్టు మంగళవారం సంకేతాలు వెలువడ్డాయి.
బదిలీ ప్రచారం : సక్సేనాను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసినట్టుగా బుధవారం ప్రచారం బయలు దేరింది. దీనికి తోడు ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జ్ఞాన దేశికన్‌కు లేఖ వచ్చినట్టు సంకేతాలు రావడంతో సక్సేనా బదిలీ చేయబడ్డట్టేనా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఆయన్ను ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపినట్టు సమాచారం పొక్కింది. కొత్త ఈసీ ఎంపికకు సంబంధించిన ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితాను ఢిల్లీకి పంపించాలని ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చిందన్న సమాచారంతో కొన్ని మీడియాలు అత్యుత్సాహం ప్రదర్శించాయి.
సక్సేనా బదిలీ అంటూ, ప్రతి పక్షాల దెబ్బకు ఆయన బదిలీ చేయబడ్డట్టుగా హంగామా సృష్టించాయి. మీడియాల్లో వచ్చిన కథనాలతో సక్సేనా విస్మయంలో పడక తప్పలేదు. సచివాలయం చేరుకున్న సక్సేనా మీడియాల్లో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలుగా తేల్చారు. తానెక్కడికీ బదిలీ కాలేదని, తనకు ఎలాంటి సమాచారమే లేదని స్పష్టం చేశారు. ఏ ప్రాతిపదికన తాను బదిలీ అంటూ హంగామా సృష్టించారంటూ మీడియాను ప్రశ్నించారు. ఓటర్ల జాబితా విషయంగా గురువారం తాను మీడియాను కలవబోతున్నట్టు వ్యాఖ్యానించారు.