బీజేపీ జెండాతో ఓ చిన్నారి
లక్నో: తాజాగా దేశవ్యాప్తంగా వెలువడ్డ పలు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాక్‌నే ఇచ్చాయి. యూపీలో విపక్షాలు చేతులు కలపటంతో కీలకమైన కైరానా లోక్‌సభ స్థానాన్ని కోల్పోవటం, అదే సమయంలో మరో సిట్టింగ్ స్థానం నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చిత్తుగా ఓడటం బీజేపీకి మింగుడుపడటం లేదు. అయితే ఈ ఓటమికి బీజేపీ నేతలు చేప్తున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి.
వేసవి సెలవులే తమ కొంప ముంచాయని పాడి పరిశ్రమల శాఖా మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి చెబుతున్నారు. ‘పార్టీ మద్ధతుదారులు, కార్యకర్తలు, ఓటర్లు అంతా వేసవి సెలవుల కారణంగా కుటుంబాలతోసహా ఊళ్లకు వెళ్లారు. వారిని ఇబ్బంది పెట్టకూడదని అధిష్ఠానం భావించింది. ఒకవేళ వారంతా అందుబాటులో ఉండి ఉంటే కైరానా, నూర్‌పూర్‌లో బీజేపీ అవలీలగా గెలిచి ఉండేది’ అని లక్ష్మీ నారాయణ్ అంటున్నారు.
అయినా ఉప ఎన్నికలను.. సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి తీరుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీలోని అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని హర్దోయి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం యోగిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment