అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా సమానత్వం మాత్రం పూర్తిగా లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరవైంది. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చట్టసభల్లో సమానత్వం ఉందని చెబుతున్నా ‘పేరుకే పెత్తనం’ అనే చందంగా వ్యవస్థ సాగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా తెలుగు మహిళలు ఏమంటున్నారంటే....
మరింత గుర్తింపు అవసరం
కేవలం మహిళా దినోత్సవం నాడే మహిళల బాగోగులు, త్యాగాలు గుర్తించి అభినందించడానికి పరిమితం కాకుండా ఎళ్లవేళలా ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం అందించాలి. నేటి మహిళ పురుషులతో సమానంగా ఎన్నో రంగాలలో ముందుకు వెళుతున్నా సమాజంలో మరింత గుర్తింపు అవసరం. అన్ని విషయాల్లోనూ తగినంత ఏకాగ్రత, ఓర్పు, సహనంతో జఠిలమైన సమస్యలను పరిష్కరించే మహిళలను ప్రముఖ వ్యక్తిగా కుటుంబంలో ఉన్నత స్థానం కల్పించాలి. బాల ్యం నుంచి వృద్ధాప్యం వరకు రక్షణ కల్పించాలి. - వి.మంజుల శివ కుమార్ గృహిణి, (ఠాణే) స్ఫూర్తి కలిగిస్తుంది
మహిళా దినోత్సవం మహిళలకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది. సమాజంలో మహిళా వికాసానికి ఇంత వరకూ మనం సాధించిన ప్రగతి, మున్ముందు మహిళాభ్యుదయానికి చేపట్టగలిగే ఎన్నో సంస్కరణల గురించి పునశ్చరణ చేయడానికి ఇది ఎంతో తోడ్పడతుంది. సమాజంలో మహిళల పట్ల నేటికీ ఆగని కొన్ని దురాచారాలు, అన్యాయాలను వ్యతిరేకిస్తూ మహిళలు ముక్త కంఠంతో పోరాడాలి. అందుకు వేదికగా రాజకీయాలను ఎంచుకుని మహిళల అభ్యున్నతికి కృషి చేయాలి.
- గ్రంధి మహాలక్ష్మి మూర్తి (వాషి)
మహిళలు తమ అస్తిత్వాన్ని చాటుకోవాలి..
పురుషులు, మహిళలు అన్న తేడాలేంటి? ఇద్దరూ సమానంగా తమతమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కానీ పురుషుల కంటే కూడా మహిళలు అధిక సహనం పాటించాల్సి వస్తుంది. మహిళలు స్వతంత్రత కలిగి ఉండాలి. ఆర్థికంగా నిలదొక్కుకొని రాణించగల అవసరం ఉంది. ఏ రంగంలోనైనా మగవారితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. మగవారితో సమానంగా పనులు చేసి తర్వాత కూడా ఇంటి బాగోగులు చూసుకుంటున్నారు.
- కార్తికి బోడా (షోలాపూర్)
50 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మున్ముందు రాజకీయాల్లో కూడా వారు క్రీయాశీలక పాత్ర పోషిస్తారు. మహిళలపై నేరాలు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలి.
- డాక్టర్ సంజన సుంక (భివండి)
మార్పు రావాలి
ఇది 113వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇప్పటికీ మహిళలకు విముక్తి కలగలేదు. ప్రస్తుతం దేశంలో ఏదో ఒక చోట సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులకు మహిళలు బలి అవుతూనే ఉన్నారు. మహిళలను కేవలం జన్మనిచ్చే యంత్రంగా చూస్తున్నారు. స్వేచ్ఛలేని ఈ ప్రపంచంలో గర్భంలో ఉన్నది ఆడ పిల్ల అని తెలియగానే తల్లిదండ్రులు భయపడి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. సమాజంలో చైతన్యం రావాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలలో మార్పులు రావాలసిన అవసరం ఉంది.
- వడ్డెపల్లి అనూష (ఉపాధ్యాయురాలు) భివండి
స్త్రీలను గౌరవించిన నాడే అభివృద్ధి
కష్టపడటం, సంఘర్షణమయ జీవనం, పట్టుదల, ఆశపడి జీవించడం, అనుకున్నది సాధించడం, మహిళకు ఉన్న ప్రత్యేకత కానీ తరాలు మారినా మహిళల తలరాతలు మార్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. మహిళా బిల్లు ఎన్నో ఎళగా అమలుకు నోచుకోలేదు. నిర్భయ చట్టం ఉన్నా ప్రతి రోజు మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావాలి. స్త్రీని గౌరవించిన నాడే మహిళాభివృద్ధి సాధ్యమవుతుంది.
-తేజస్విని అజ్వేశ్, ఎంబీఏ విద్యార్థిని (పుణే)
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Published Sun, Mar 8 2015 3:54 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM
Advertisement
Advertisement