జనరంజకంగా!
నేటినుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, ముంబై: ప్రజాసామ్యకూటమి (డీఎఫ్) ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ప్రభావం ఈ సమావేశాల్లో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం ప్రతిపాదించే జనాకర్షణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఓటర్లను ఆకట్టుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా అధికారపక్షం అందరికీ అనుకూలమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే విధంగా కొన్ని అంశాలను తెరమరుగు చేసేందుకు యత్నించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇలాంటి విషయాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడమనేది సర్వసాధారణం. ఆదర్శ్ కుంభకోణం, టోల్ వసూలు, శాంతి భద్రతలు, అక్రమ నిర్మాణాలు తదితర అంశాలతోపాటు విద్యుత్, జలవనరుల శాఖల్లో అవినీతి ఆరోపణలు ఈ సమావేశాల్లో గందరగోళాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా 2000 సంవత్సరం వరకు మురికివాడల క్రమబద్ధీకరణ అంశం చర్చల్లోకి రానుంది.
ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు అధికారపక్షానికి చెందిన ఇతర నాయకులు ఈ అంశంపై ప్రజలకు హామీలిచ్చారు. దీంతో ఎన్నికలకు ముం దు జరగనున్న ఈ బడ్జెట్‌లో 2000వ సంవత్సరం వరకు ఏర్పాటైన మురికివాడలను క్రమబద్ధీరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రతిపాదించనున్నా రు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1995 నాటికి మురికివాడల సంఖ్య 10 లక్షలు కాగా 2011 నాటికి అది ఏకంగా 27 లక్షలకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మురికివాడలను క్రమబద్ధీకరించాలని అధికార పక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇబ్బంది ఉండదని కొందరు కాంగ్రెస్ నాయకులు సూచిం చినట్టు తెలిసింది. దీంతో ఈ సమావేశాల్లో మురికివాడల క్రమబద్ధీకరణకు సంబంధించి ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా మురికివాడల క్రమబద్ధీకరణ నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు పలికే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.
తేనీటి విందు బహిష్కరణ సరికాదు: సీఎం
శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు ఇచ్చే తేనీటి విందుకు ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం శోచనీయమని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ పేర్కొన్నారు. తేనీటి విందులో పాల్గొన్న అనం తరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తేనీటి విందును బహిష్కరించడం పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధం.
ప్రభుత్వం లేవనెత్తే అంశాలపై చర్చలు జరి పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్షాలు ఆవిధంగా వ్యవహరించాయి. ప్రచార లబ్ధి పొందేందుకే ఇలా చేశాయి’ అని ఆయన అన్నారు.
ఆదర్శ్’పై జవాబు కోరతాం: ఏక్‌నాథ్ ఖడ్సే
ముంబై: ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయమై గవర్నర్ జవాబుకోరతామని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఇక్కడ మీడియా తో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఆదర్శ్ కుంభకోణంతోపాటు వివిధ అంశాలను సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందనే విషయం చెప్పాలంటూ డిమాండ్ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా లేవని, ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లోనూ నిలదీస్తాయన్నారు. సమావేశాల వ్యవధిని పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. కాగా సమావేశాల ప్రారంభానికి ముందురోజు ముఖ్యమంత్రి ఇచ్చే సంప్రదాయ తేనీటి విందును విపక్షాలు బహిష్కరించాయి.