బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు 2015-16 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ, పారిశ్రామిక పరిస్థితులను అనుసరించి సంక్షేమం, అభివృద్ధికి దాదాపు సమాన నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.1.38 లక్షల కోట్లు కాగా ఈ సారి అంతకంటే పదిశాతం ఎక్కువగా బడ్జెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న మేనెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామీణుల సంక్షేమం, అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించనున్నారు.
మరోవైపు సాగు భూమిలేని వారికి ప్రభుత్వమే భూములు కొనుగోలు చేసి వితరణ చేసేలా ఓ పథకాన్ని కూడా బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రతి గ్రామపంచాయితీకు ఒక సహకార గ్రామీణ బ్యాంకును నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక త్వరలో బీబీఎంపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేయర్ పీఠాన్ని చేజెక్కించుకోవడానికి వీలుగా బీబీఎంపీ పై కూడా వరాలు జల్లు కురిపించవచ్చునని తెలుస్తోంది. నేటి బడ్జెట్‌లో బీబీఎంపీకి దాదాపు రూ.2,500 కోట్లు కేటాయించవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోయాయి. ఈ విషయమై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్న సిద్ధరామయ్య ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పలు రాయితీలను ప్రకటించవచ్చునని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాట్ తగ్గింపు ఇందులో ప్రధాన అంశం కానుందని సమాచారం. కర్ణాటకవాసులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఐఐటీను ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటకకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందుకు భూ కేటాయింపులు, ఇతర మౌలిక సదుపాయాల పై రాష్ట్ర బడ్జెట్‌లో సిద్ధరామయ్య స్పష్టత ఇవ్వనున్నారని అధికారులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూను పెంచుకోవడం కోసం మద్యం ధరలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ తదితర వాటిని పెంచి ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితోపాటు ఆర్థికశాఖను నిర్వహిస్తున్న సిద్ధరామయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం పదోసారి. ముఖ్యమంత్రి హోదాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఇది మూడోసారి.
గత బడ్జెట్ హామీల సంగతేమిటో......
2014-15 బడ్జెట్‌లో సిద్ధరామయ్య ప్రకటించిన వివిధ పథకాలు ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ కనీసం ప్రారంభం కూడా కాలేదు. ఈ పథకాలకు గాను కనీసం ఈ బడ్జెట్‌లో నైనా నిధులను కేటాయిస్తారా, లేక వాటిని కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు వివిధ అభివృద్ధి పనులకు గాను ఆయా శాఖలకు కేటాయించిన నిధులు కూడా కేవలం 40 నుంచి 50శాతం మాత్రమే ఖర్చయ్యాయి. దీంతో కనీసం ఈ ఏడాదైనా సరే ప్రజా సంక్షేమ పధకాలను ప్రకటించడంతో పాటు వాటిని ప్రారంభించి, ఆయా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలనేది నిపుణుల వాదన.
నేడు బడ్జెట్
Published Fri, Mar 13 2015 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement
Advertisement