
నేటితో సిద్ధు సర్కారుకు మూడేళ్లు
► నేడు ‘జన-మన’ సంవాద కార్యక్రమం
► లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్న సీఎం
సాక్షి, బెంగళూరు: సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటై శుక్రవారం నాటికి మూడేళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులతో స్వయంగా సిద్ధరామయ్య మాట్లాడనున్నారు. నగరంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం(జీకేవీకే)లోని సమావేశ భవనంలో ‘జన-మన’ పేరిట నిర్వహించనున్న కార్యక్రమం ఇందుకు వేదిక కానుంది. వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి పది మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరంతా ముఖ్యమంత్రితో మాట్లాడనున్నారని పేర్కొన్నారు. పథకాలపై సూచనలు, సలహాలు కూడా ఇచ్చేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అన్నభాగ్య, క్షీరభాగ్య, కృషి భాగ్య, మనస్విని తదితర పధకాల పనితీరును నేరుగా ప్రజలను అడిగే తెలుసుకోనున్నామని చెప్పారు.
ప్రభుత్వ ఛానల్ ఏర్పాటు ఉండబోదు..
రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఓ ఛానల్‌ను ఏర్పాటు చేయనుందన్న వార్తల్లో నిజం లేదని మంత్రి రోషన్‌బేగ్ స్పష్టం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ద్వేషపూరిత రాజకీయాలు ఉంటాయని, అందువల్లే అక్కడ ప్రభుత్వమే ఓ చానల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం పత్రికలు, చానళ్లు చేసే విమర్శలపై సానుకూలంగా స్పందిస్తుందని, అందువల్ల ప్రభుత్వమే ఓ చానల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని అన్నారు.