చిక్కిన మావోలు | Top Maoist couple Roopesh and Shyna arrested by Andhra Pradesh Police | Sakshi
Sakshi News home page

చిక్కిన మావోలు

Published Wed, May 6 2015 2:11 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

చిక్కిన మావోలు - Sakshi

చిక్కిన మావోలు

 సాక్షి,  చెన్నై: తమిళనాడు, కేరళ, కర్ణాటక పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన మావోయిస్టుల్లో కొందరు క్యూబ్రాంచ్ చేతికి చిక్కారు. ముం దస్తు సమాచారంతో పథకం ప్రకా రం ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఆపరేషన్ విజయవంతంతో ఆ మావోయిస్టుల వద్ద తీవ్రంగా విచారిస్తున్నారు. వీరి అరెస్టుతో పలు దాడుల కుట్రలు భగ్నం అయ్యాయి. తిరుపతిలో దాడులకు వీరు వ్యూహ రచన చేసినట్టు సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృం దం కోవైలో విచారణ జరుపుతున్న ట్టు తెలిసింది.
 
  2008లో ఏప్రిల్ 19న  కొడెకైనాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో మావోయిస్టులు పత్తా లేకుండా పోయారు. ఆ ఎన్‌కౌంట ర్‌లో మావోయిస్టు నేత నవీన్‌ప్రసాద్ హతమయ్యాడు. ఈ ఘటనతో రాష్ర్టంలో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. ఇక రాష్ట్రంలో మావోయిస్టులు తోకముడిచినట్టేనన్న విషయాన్ని పోలీసు యంత్రాంగం సైతం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏడాది కాలంగా పశ్చిమ పర్వత శ్రేణుల్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్టు, ఆయుధాలను చేతబట్టి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. సమాచారం వచ్చినప్పుడల్లా క్యూ బ్రాంచ్ వర్గాలు కూంబింగ్ చేయడం పరిపాటిగా మారింది.
 
  రెండు నెలల క్రితం కేరళ - తమిళనాడు సరిహద్దుల్లోని కోయంబత్తూరుకు కూత వేట దూరంలో జరిగిన దాడి రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కేరళ అటవీ శాఖ కార్యాలయంపై దాడులు జరిగినప్పటి నుంచి మావోయిస్టులు తమ ప్రతాపం చూపించే విధంగా, తమ ఉనికిని చాటు విధంగా ఏదో ఒక చర్యకు పాల్పడుతూ వచ్చారు. ఇది కాస్త తమిళనాడు, కేరళ, కర్ణాటక పోలీసులకు సవాల్‌గా మారింది. వీరిని అదుపులోకి తీసుకోవడం లక్ష్యంగా ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు తీసుకున్నారు.
 
 చిక్కిన మావోయిస్టులు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ మేరకు వచ్చిన సమాచారంతో కోయంబత్తూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు.  సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో తమిళనాడు క్యూ బ్రాంచ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ పోలీసు బృందం పథకం ప్రకారం ఆ మావోయిస్టులను అరెస్టు చేసింది. కరుమాత్తం పట్టి వద్ద ఓ బేకరీలో టీ తాగేందుకు వచ్చిన ఐదుగుర్ని పోలీసులు తుపాకులతో చుట్టుముట్టారు. సినీ ఫక్కీలో సాగిన ఈ అరెస్టుతో ఆ ఐదుగుర్ని కోయంబత్తూరులోని క్యూబ్రాంచ్ కార్యాలయంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. విచారణలో పట్టుబడ్డ మావోయిస్టులు రూపేష్, సైనా, అనూఫ్, కణ్ణన్, ఈశ్వరన్‌లుగా గుర్తించారు. వీరిలో రూపేష్ మావోయిస్టు బృందానికి నాయకుడని తేలింది.
 
 భర్త అడుగు జాడల్లో సైనా రూపేష్ నడిచినట్టు గుర్తించారు. పలు చోట్ల దాడులకు వీరు వ్యూహ ర చన చేసినట్టుగా విచారణలో వెలుగు చూసి ఉన్నది. అలాగే, 20 మందికి వీరు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉన్న సమాచారంతో వారెక్కడ ఉన్నారో పసిగట్టి, అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పరుగులు తీస్తున్నారు. అలాగే 20 మంది తమిళుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తిరుపతిలో దాడులకు వ్యూహ రచన చేసి ఉన్నట్టుగా విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుందరి అనే మావోయిస్టు వీరితో తరచూ సంప్రదింపుల్లో ఉన్నట్టు తేలింది.  దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ఎస్పీ నేతృత్వంలోని బృందం వారి వద్ద విచారణ సాగిస్తున్నది. ఇక కోయంబత్తూరు రేంజ్ డీఐజీ ఆయుష్‌మణి తివారి, ఎస్‌పీ సుధాకర్ నేతృత్వంలోని తమిళ పోలీసుల బృందం తీవ్రంగా విచారణ సాగిస్తున్నది.
 
 డైరీలో ఏముంది: అరెస్టు చేసే క్రమంలో మావోయిస్టులు తమ చేతిలో ఉన్న ఓ డైరీని పొదల్లోకి విసిరినట్టు సమాచారం. దీనిని బేకరీ కృష్ణన్ గుర్తించి పోలీసులకు అందించాడు. అందులో యాబై ఫోన్ నంబర్లు ఉండడంతో వాళ్లు ఎవరు అన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే పోలీసులపై తిరగబడే యత్నం చేసినట్టు ఆ పరిసర వాసులు పేర్కొన్నారు.  పట్టుబడ్డ రూపేష్ ఒకప్పుడు న్యాయవాది. హైకోర్టులో క్లర్క్‌గా ఉన్న సైనాను ప్రేమించి పెళ్లి చేసుకుని, వామపక్ష భావాలతో మావోయిస్టుగా మారాడు.
 
 ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో  మావోయిస్టుల నెట్ వర్క్‌ను విస్తరించడం లక్ష్యంగా పశ్చిమ పర్వత శ్రేణుల్ని అడ్డాగా చేసుకుని తలదాచుకుని ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. పట్టుబడ్డ వారిలో రూపేస్, సైనా,  అనూఫ్ కేరళ రాష్ట్రం తిరుచ్చూర్‌కు చెందిన వారు. ఇక, కణ్ణన్, ఈశ్వరన్ తమిళనాడు వాసులు. వీరి అరెస్టుతో అజ్ఞాతంలో ఉన్న వీరి మద్దతు దారులు ఏదేని దాడులకు వ్యూహ రచన చేయొచ్చన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు భద్రత పెంచారు. అలాగే, సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వీరి మద్దతు దారులు ఇతర ప్రాంతాల్లోకి తరలి వెళ్లకుండా నిఘాతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement