సాక్షి, చెన్నై: సబర్బన్ రైళ్ల టికెట్ల కోసం ఇక క్యూలో నిల్చోవాల్సిన అసవ రం లేదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు టికెట్టు ఉన్నట్టే. ఇందుకు తగ్గ సరి కొత్త విధానానికి దక్షిణ రైల్వే శ్రీకారం చుట్టింది. దీనిని ఎగ్మూర్ స్టేషన్‌లో ఎంపీ రంగరాజన్ బుధవారం ప్రారంభించారు. చెన్నై నగరంలో బీచ్ నుంచి తాంబరం - చెంగల్పట్టు వైపుగా, సెంట్రల్ నుంచి ఆవడి - తిరువళ్లూరు - అరక్కోణం వైపుగా, సెంట్రల్, బీచ్‌ల నుంచి గుమ్మిడి పూండి వైపుగా ఎలక్ట్రిక్ రైళ్లు సేవల్ని అందిస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ఈ రైళ్ల సేవల్ని పొందుతున్నారు. చిన్న చిన్న స్టేషన్లలో ఈ రైళ్ల టికెట్లు తీసుకోవడం సులభమే. అయితే, ఎగ్మూర్, తాంబరం వంటి స్టేషన్లలో ఈ రైళ్ల టికెట్ల కోసం క్యూలో బారులు తీరాల్సిందే. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రైల్వే యంత్రాంగం ప్రయాణికులకు తమ సేవల్ని మరింత దరిచేర్చడంతో పాటుగా, కాగిత రహిత టికెట్ విధానం( యూటీఎస్)ను అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించింది.
సెల్ ఫోనే టికెట్టు: ఈ విధానం మేరకు సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు టికెట్టు ఉన్నట్టే. ముంబై, చెన్నై సబర్భన్ రైళ్ల టికెట్లకు తొలి విడతగా ఈ విధానం అమలు చేయడానికి కేంద్ర రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఆండ్రాయిడ్, విండోస్ వంటి స్మార్ట్ ఫోన్లు కల్గిన వాళ్లు ఈ విధానం మేరకు సులభంగా టికెట్టును ఏ సమయంలో నైనా సరే పొందేందుకు వీలు ఉంది. అయితే, టికెట్టు కోసం తమ సెల్ ఫోన్‌లో రైల్వే శాఖ అందించే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే శాఖకు అందించే ఆర్- వాలెట్‌లో ప్రయాణికుడు ఖాతా తెరవాల్సి ఉంటుంది. అందులో తనకు కావాల్సిన సొమ్మును జమ చేసుకుని అవసరమైనప్పుడల్లా టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
శ్రీకారం: కాగిత రహిత యూటీఎస్ విధానానికి బుధవారం శ్రీకారం చుట్టారు. చెన్నై ఎగ్మూర్ స్టేషన్‌లో దక్షిణ రైల్వే ఉన్నతాధికారి అగర్వాల్ నేతృత్వంలో జరిగిన వేడుకలో ఎంపీ రంగరాజన్ ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా యూటీఎస్‌ను పరిచయం చేశారు. ఈ విధానం గురించి అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణీకులకు ఈ విధానం ఎంతో దోహదకరంగా ఉంటుందని వివరించారు. సెల్ ఫోన్‌లోని యాప్ డౌన్‌లోడింగ్ ఆధారంగా, ఆర్ -వాలెట్ ఖాతా మేరకు ఎప్పటికప్పుడు టికెట్లను కొనుగోలు చేసుకునే వీలు ఉందని గుర్తు చేశారు. టికెట్టు కొనుగోలు, రద్దు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈవిధానాన్ని ప్రయోగాత్మకంగా చెన్నై ఎగ్మూర్ - తాంబరం మధ్య అమలు చేస్తున్నామని, దశల వారీగా విస్తరించనున్నట్లు వివరించారు.
ఇక సెల్‌ఫోనే రైలు టికెట్
Published Thu, Apr 23 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement