పందికొక్కు తెచ్చిన తంటా
కోలారు : విద్యుదాఘాతోంతో మృతి చెందిన పందికొక్కును తొలగించే ప్రయత్నంలో చిన్నారితో సహా దంపతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించగా భర్త మృతి చెందాడు. మిగతా ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన బుధవారం నగరంలోని చౌడేశ్వరి నగర్‌లో చోటు చేసుకుంది. చౌడేశ్వరి నగర్‌లో లక్ష్మణ్(31), రాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదు నెలల చిన్నారి ఉంది. ఇంటికి ఇచ్చిన కనెక్షన్ తెగి ఇంటి పక్కనే ఉన్న ముళ్లతంతిపై పడింది. దీంతో తచ్చాడుతున్న పందికొక్కు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.
విషయం తెలియని లక్ష్మణ్ చనిపోయిన పందికొక్కును అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుందని భావించి అక్కడి నుంచి తీసివేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్‌ను తాకాడు. దీంతో అతను విద్యుదాఘాతానికి గురై గట్టిగా కేకలు వేశాడు. చంటి పిల్లవాడిని ఎత్తుకున్న బాలింత రాధమ్మ భర్త లక్ష్మణ్‌ను కాపాడే ప్రయత్నం చేయగా వారు సైతం విద్యుదాఘాతానికి గురయ్యారు.
స్థానికులు స్పందించి వారిని నగరంలోని ఎస్ ఎన్ ఆర్ ఆస్పత్రికి తరలించగా లక్ష్మణ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. బెస్కాం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ఘటనపై టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.