
చాక్లెట్లలో బంగారం బిస్కెట్లు
చెన్నై: మలేషియా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 2 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. రాయపేటకు చెందిన యువకుడిని అరెస్టు చేశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చెన్నైకి వచ్చింది.
అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో రాయపేటకు చెందిన అరాఫత్ (27) వద్ద ఉన్న బ్యాగులో చాక్లెట్లు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా వాటిలో ముక్కలు ముక్కలుగా కత్తిరించిన బంగారం బిస్కెట్లు ఉన్నాయి. మూడు ప్యాకెట్లలో మొత్తం 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో అరాఫత్ స్మగ్లింగ్ కూలీగా పనిచేస్తున్నట్టు తెలిసింది.