భారత్తో మ్యాచ్ రోజున.. పాక్కు జై కొట్టారు
మంగళూరు: టి-20 ప్రపంచ కప్లో భాగంగా ఈ నెల 19న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోరుకున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవగానే వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కాగా అదే రోజు కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని పుట్టురులో ఇద్దరు డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాకిస్తాన్కు మద్దతుగా వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు. 'పాకిస్తాన్కు జై' అంటూ వాట్సాప్లో ఫోస్ట్ చేశారు. దీనిపై ఇతర కాలేజీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు.
ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో పాక్కు అనుకూలంగా పోస్టింగ్ చేసిన ఇద్దరు విద్యార్థులను అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరిచగా, సత్ప్రవర్తనతో ఉంటామనే హామీపై వారిని విడుదల చేశారు. విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదు చేసే ఉద్దేశంలేదని పోలీసులు చెప్పారు.