
అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు
ఏ తరహా పరిశ్రమలు నిర్మిస్తారో చెప్పండి
రైతులకు వెన్నుదన్నుగా ఉంటా..: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): భూసమీకరణ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మచిలీపట్నంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉన్న సమయంలోనే మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో భూసమీకరణను ప్రభుత్వం తెరపైకి తేవడం రైతులను మోసగించడమేనన్నారు. భూసేకరణ అమలులో ఉన్నప్పుడు రైతులు తమ భూములను విక్రయించేందుకు అవకాశం లేకుండా చేశారన్నారు. భూసమీకరణను తెరపైకి తెచ్చి కొందరు మంత్రులు తమ అనుచరులతో మచిలీపట్నంలో భూములు కొనుగోలు చేయించారని, ఆ భూములను పారిశ్రామిక క్యారిడార్‌కు ఇస్తామని ప్రకటించి రైతులను మోసగించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
భూసేకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం :
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. రైతు సంఘాలు ఏళ్ల తరబడిన చేసిన పోరాటం కారణంగా పార్లమెంటులో 2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ విరమించుకున్నారని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రే వెనుకంజ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేమీకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించడం రైతాంగ వ్యతిరేఖ చర్యేనన్నారు. ప్రస్తుతం జారీ చేసిన భూసమీకరణ నోటిఫికేషన్‌లో రైతులు 60 రోజుల్లో తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు వెసులుబాటు ఇవ్వాల్సి ఉండగా 15 రోజులకే కుదించటం దుర్మార్గమైన చర్య అన్నారు. తెలంగాణాలో భూసేకరణ నిమిత్తం 123వ నెంబరు జీవోను జారీ చేస్తే అక్కడి రైతులు కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు.
రైతులను ముంచి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనమా :
బందరు పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాల భూమి అవసరమని చెబుతున్నారు. పారిశ్రామిక క్యారిడార్ కోసం 28వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయటం రైతులను ఇబ్బంది పెట్టడమేనన్నారు. ఏ పరిశ్రమలు నిర్మిస్తారో వాటికి ఎంత భూమి కావాలో వివరాలు చెప్పకుండా భూములు ఎలా సమీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు తీసుకుని బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగిస్తారా అన్నారు. పారిశ్రామిక క్యారిడార్ పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులు సైతం అభివృద్ధి చేయలేకపోయారన్నారు.
గిలకలదిండి హార్బర్ వద్ద ముఖద్వారం పూడిక తీయలేదని, హార్భర్‌లో తాగునీటి వసతి కల్పించలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రైతులు చేసే పోరాటానికి రైతు సమాఖ్య ప్రతినిధిగా తనవంతుగా అండదండగా ఉంటానని ఆయన చెప్పారు. పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న భూదందాపై ముద్రించిన కరపత్రాలను అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు అందజేసి వారిని చైతన్యవంతం చేస్తామన్నారు.