దేవుడా!
♦ వ్యాన్–బస్సు ఢీ ముగ్గురు మృతి
♦ ముగ్గురికి తీవ్రగాయాలు
అన్నానగర్: దేవుడిని దర్శించుకుని తిరిగి వస్తూ వ్యాన్–బస్సు ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమార్తె సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తిరుచ్చెంగోడు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా భవానీసాగర్ ఆనకట్ట నుంచి సత్యమంగళం వెళ్లే రోడ్డులో ఉన్న తొప్పమ్ పాళయం ప్రాంతానికి చెందిన కర్ణన్. ఇతను ఇటీవలే మృతి చెందాడు. ఇతని భార్య కాంతామణి (50). వీరి కుమార్తెలు హరిప్రియ (33), కీర్తిక (31). వీరిలో హరిప్రియకి కరుణాకరన్‌తో ఆరు నెలల ముందు వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరికి పిల్లలు పుట్టాలని నామక్కల్ ఆంజనేయర్, తిరుచ్చెంగోడు అరత్తుకాళీశ్వరర్ ఆలయంలో దేవుడిని దర్శించుకోవాలని సిద్ధమయ్యారు. దీంతో మంగళవారం కాంతామణి, హరిప్రియ ఈమె భర్త కరుణాకరన్, కీర్తిక, కాంతామణి మరిది విజయకుమార్ (50) వీరందరూ ఓ వ్యాన్‌లో నామక్కల్ తిరుచ్చెంగోడు ఆలయానికి వెళ్లారు. స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు వ్యాన్‌లో బయలుదేరారు. తిరుచ్చెంగోడు సమీపం వరకూరామ్‌పట్టి వద్ద వస్తుండగా ఎదురుగా వస్తున్న ఈరోడ్ నుంచి సేలం వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంతామణి, హరిప్రియ, వ్యాన్ డ్రైవర్ రాజ్‌కుమార్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కీర్తిక, కరుణాకరన్, విజయకుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గాయపడ్డ ముగ్గురిని తిరుచ్చెంగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుచ్చెంగోడులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దరా>్యప్తు చేస్తున్నారు.