సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పండుగల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాబోయే పండుగలు సగటు జీవికి భారంగా పరిణమించేట్లున్నాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంది. వచ్చే నెలలో వినాయక చవితి ఉంది. ఈ ప్రధాన పండుగల సమయాల్లో పళ్లు, కూరగాయల ధరలు కొండెక్కడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఉల్లి, అరటి, వెల్లుల్లి ధరలు అదుపు తప్పి పోయాయి. ఉల్లి ధర కేజీ రూ.70కి పెరిగింది. నిత్యం వంటకాల్లో దీని అవసరం ఉంటుంది. కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు కానీ పూర్తిగా మినహాయించలేని పరిస్థితి. ఇక దీనితో పచ్చి మిర్చి ధర కూడా పోటీ పడుతోంది. పండుగలంటే నైవేద్యం, పంచామృతాలకు అరటి తప్పనిసరి.
రాష్ట్రంలో భారీ వర్షాలకు అనేక పొలాలు, తోటలు నీట మునిగాయి. దరిమిలా క్యారెట్, మిరప, కోసు, బఠాణి, అకు కూరల ధరలూ బాగా పెరిగిపోయాయి. బీన్స్, టమోటా ధరలు తగ్గడం వినియోగదారులకు కాస్త ఊరట. మహాలక్ష్మి వ్రతానికి ఇక కేవలం మూడు రోజులు మాత్రమే ఉండగా, అరటి (ఏలక్కి) ధర కేజీ రూ.60-70 పలుకుతోంది. హాప్‌కామ్స్‌లో ఏలక్కి ధర రూ.63, పచ్చ అరటి ధర రూ.23కు పెరిగిపోయాయి. పండుగల సమయానికి వీటి ధర కేజీకీ మరో రూ.10 పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అరటి ఉత్పత్తి తగ్గిపోయిందని అధికారులు చెప్పారు. దీనికి తోడు పండుగ సమయాల్లో మంచి ధర లభిస్తుందనే అంచనాతో రైతులు వాటి కోతను వాయిదా వేస్తూ వస్తున్నారని తెలిపారు. పండుగ సమయాల్లో అరటి మార్కెట్‌ను ముంచెత్తినా డిమాండ్ దృష్ట్యా ధర తగ్గే అవకాశాలు లేవని విశ్లేషించారు. కాగా ప్రస్తుతం కేజీ క్యారెట్ ధర రూ.72, పచ్చి మిరప రూ.70, బఠాణి రూ.68 చొప్పున పలుకుతున్నాయి. టమాట కేజీ రూ.10, సిమ్లా ఆపిల్ రూ.80, దానిమ్మ రూ.90 చొప్పున విక్రయిస్తున్నారు.
బళ్లారిలోనూ అంతే..
బళ్లారి మార్కెట్లో పచ్చిమిర్చి, ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. మంగళవారం బళ్లారి మార్కెట్‌లో పచ్చి మిర్చి కేజీ ధర ఏకంగా రూ.90, ఉల్లిధర రూ.70 కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర సమ్మె కారణం.. అధిక వర్షాల వల్ల ఉల్లిగడ్డలు చెడిపోవడం.. మిర్చి పంట తగినంత రాకపోవడం తదితర కారణాలతో ఈ రెండు కూరగాయలు ధరలకు రెక్కలు వచ్చాయి. వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే రూ.500లు ఖర్చుపెట్టాల్సి వస్తోందని, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు జేబునిండా డబ్బులు తీసుకెళ్లినా బ్యాగు నిండా కూరగాయలు రాని పరిస్థితి నెలకుంది. వీటితోపాటు మిగిలిన ఓ కూరగాయలు ముట్టుకున్నా కిలో రూ.50లకు పైగా ధర ఉండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కిలో టమాట రూ.60 ఉండగా.. నేడు దాని ధర రూ.6కు పడిపోయింది. ఈ కష్టకాలంలో టమాట సామాన్యుల పాలిట ఆపద్బాంధవుడిలా మారింది
చుక్కల్లో ధరలు
Published Wed, Aug 14 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement