ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీ
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు
- బ్లూప్రింట్ రూపకల్పనకు చొరవ
- వివిధ శాఖల అధికారులతో చర్చ
న్యూఢిల్లీ: దేశ జాతీయ రాజధానిని కేంద్రం ప్రభుత్వం ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దనుంది. ఈ దిశగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకున్నారు. ఇందులోభాగంగా నగర సుందరీకరణ, అభివృద్ధికి ఓ బ్లూప్రింట్ రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రజాపనుల శాఖతోపాటు తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశమైన మంత్రి ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. దీంతోపాటు మురుగునీటి పారుదలను మెరుగుపరచడం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.
రహదారులు, పాత్‌వేలు. ఖాళీ స్థలాలు, ప్రజాదరణ పొందిన స్మారకాల నిర్వహణ తదితర అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగరవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దాలన్నారు. భారతీయుడుగానీ లేదా విదేశాలనుంచి తొలిసారిగా ఇక్కడికి వచ్చే ప్రతిని ధుల బృందం ఈ నగరాన్ని చూసినపుడు ఎలాంటి అనుభూతి పొందుతాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించా రు. ఇతర దేశాల్లోని నగరాలతో పోలిస్తే ఢిల్లీకి ఎన్నో స్థానంలో ఉండొచ్చనే అంశంపైనా చర్చించారు. ఇంకా ఈ సమావేశంలో ఉత్తర ఢిల్లీ, దక్షిణ, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.