సాక్షి, లక్నో : లక్షల సంఖ్యలో హాజరైన భక్తులు.. జై శ్రీరామ్-భారత్ మాతాకీ జై నినాదాలు.. 1.7 లక్షల కోట్ల విద్యుత్ దీపాల వెలుగులు.. ఆకాశంలో పుష్పక విమానం(హెలికాఫ్టర్) నుంచి పూల వాన... సీతాసమేత రాముడి అవతారంలో వచ్చిన వ్యక్తులకు పూల మాలలు... వెరసి సరయు నది ఒడ్డన ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహా దీపోత్సవంలో కనిపించిన దృశ్యాలివి.
రామ మందిర నిర్మాణ కల సాకారం హమీని కూడా మేనిఫెస్టోలో చేర్చి బీజేపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. కోర్టు చిక్కులు వీడిపోగానే నిర్మాణం శరవేగంగా చేపట్టాలని ఆలోచనలో ఆదిత్యానాథ్ సర్కార్ ఉంది. అయితే గుడి నిర్మాణంతోనే ఆగిపోకుండా.. అయోధ్యను సమూలంగా మార్చేయాలన్న కొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే వంద మీటర్ల ఎత్తైన రామ విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయగా.. తాజాగా అయోధ్య అభివృద్ధి కోసం రూపొందించిన బ్లూప్రింట్ బయటకు పొక్కింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెలువరించిన కథనం ప్రకారం... రామాయణ మ్యూజియం, అయోధ్య నగర్ నిగమ్, అయోధ్య అనుసంధానం, ఫైజాబాద్ మున్సిపల్ బోర్డు ఏర్పాటు, సరయు మహోత్సవం, దిగంబర్ అఖడ హాల్ నిర్మాణం, సరయు నది ఒడ్డున అభివృద్ధి-5 ఘాట్‌ల వద్ద సోలార్ వ్యవస్థ ఏర్పాటు, అయోధ్య రోడ్ నుంచి హనుమాన్ ఘడి వద్దకు రోడ్డు నిర్మాణం, కనక్ భవన్, దశరథ్ భవన్, రామ్ జానకీ మార్గ్ పేరిట అయోధ్య-జనక్‌పూర్ మధ్య రోడ్డు, రామ్ కథ గ్యాలెరీ వీటితోపాటు క్వీన్ హియో మెమోరియల్ నిర్మాణం ఆ జాబితాలో ఉన్నాయి. ఇందుగానూ అయ్యే ఖర్చును ఇప్పుడప్పుడే అంచనా వేయటం కష్టం. రామ రాజ్యం అంటే అభివృద్ధి, పేదరికాన్ని పాలద్రోలడమేనని ఆదిత్యానాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్య అభివృద్ధి విషయంలో రాజకీయ విమర్శలు ఎదురైన తాను అస్సలు పట్టించుకోనని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment