
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయ గర్భగుడి నిర్మాణానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం శంకుస్థాపన చేశారు. మందిర నిర్మాణాన్ని దేశ ఐక్యతకు నిదర్శనంగా, దురాక్రమణదారులపై విజయంగా అభివర్ణించారు. చరిత్రాత్మక తీర్పుతో రామజన్మభూమి–బాబ్రీమసీదు వివాదానికి తెరదించి మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో 2020 ఆగస్టులో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తాజాగా ప్రధానాలయ నిర్మాణానికి యోగి చేతుల మీదుగా శైల పూజ జరిగింది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామ మందిర ట్రస్టు అధికారుల సమక్షంలో సీఎం పునాది రాళ్లు వేశారు. ‘‘అయోధ్య రామాలయం మన జాతీయాలయం. ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ప్రతి భారతీయునికీ గర్వకారణం’’ అన్నారు. 500 ఏళ్లుగా భారతీయులు అనుభవిస్తున్న వేదన ఆలయ నిర్మాణంతో దూరమవుతుందన్నారు.