శిష్యుడి కోసం సినిమా
శిష్యుల కోసం నిర్మాతలుగా మారుతున్న దర్శకులు కోలీవుడ్‌లోనే అధికం అని చెప్పవచ్చు. శంకర్, ఏఆర్.మురుగదాస్, గౌతమ్‌మీనన్ ఇలా చాలామంది తమ శిష్యులకు దర్శకులుగా అవకాశం కల్పించడానికి నిర్మాతలయ్యారు. తాజాగా ఈ కోవలోకి దర్శకుడు వెంకట్‌ప్రభు చేరారు. చెన్నై 28, బిరియాని, మాస్, చెన్నై 28–2 ఇలా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఈ మధ్య బ్లాక్ టికెట్ కంపెనీ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి స్వీయ దర్శకత్వంలో చెన్నై 28–2 చిత్రాన్ని తెరకెక్కించారు.
ఆ తరువాత మరే చిత్రం ఆయన చేయలేదు. తాజాగా నిర్మాతగా తన శిష్యుడు సవరన్‌రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు. దీనికి తన సోదరుడు ప్రేమ్‌జీని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇక హీరోహీరోయిన్లుగా వైభవ్, సనాలను ఎంపిక చేశారు. విలన్‌గా నటుడు సంపత్ నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది.