విదర్భలో నిరంతర అభివృద్ధికి జాతీయ పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఆ ప్రాంత పర్యావరణ కార్యాచరణ సమితి(వీఈజీఏ) పేర్కొంది.
నాగపూర్: విదర్భలో నిరంతర అభివృద్ధికి జాతీయ పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఆ ప్రాంత పర్యావరణ కార్యాచరణ సమితి(వీఈజీఏ) పేర్కొంది. మార్చి 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో పర్యావరణ నియంత్రణ సంస్థ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రాజెక్టును మంజూరు చేసే ముందు ఆ ప్రాంతంలో పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ రాష్ట్రాల్లో ఈ శాఖల అవసరముందని జస్టిస్ ఏకే పాఠక్, జస్టిస్ ఎస్‌ఎస్ నిజ్జర్, జస్టిస్ ఇబ్రహీం కలిఫుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలివ్వడాన్ని వీఈజీఏ కన్వీనర్ సుధీర్ పలివాల్ స్వాగతించారు. గతంలో ఆదేశించిన మాదిరిగానే నాగపూర్‌లోని పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ సంరక్షణ చట్టం, 1980 కింద అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టు నెలకొల్పాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక నుంచి కొత్త ఆథారిటీ కింద అటవీ విధానం అమలు కానుందని ఆయన తెలిపారు. స్వయం ప్రతిపత్తిగల నియంత్రణ సంస్థ కింద కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు పనిచేయనుండటం హర్షించదగ్గ విషయమన్నారు.
అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అనుమతినిచ్చే విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పదవుల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నియామకం ఇక నుంచి సాధ్యం కాకపోవచ్చని ఆయన తెలిపారు. దీనివల్ల మంత్రిత్వ శాఖ జోక్యం తగ్గి వివిధ బోర్డులు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశముంటుందన్నారు. ‘విదర్భ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు అత్యవసరం. 60 శాతం అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 100కు పైగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలని ప్రతిపాదించారు. మైనింగ్, సిమెంట్ ప్లాట్ల ఏర్పాటువల్ల అటవీ ప్రాంతం అంతం అవుతుంది. కాలుష్య తీవ్రత పెరిగుతుంద’ని పలివాల్ అన్నారు.