ప్రభుత్వానికి మాజీ సీఎం శెట్టర్ సూచన
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు అలుముకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుల రుణాలను మాఫీ చేయాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు రూ.25వేల వరకు రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్టమంతటా పంటనష్టం, అప్పుల బాధతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే 200మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు.
అంతేకాక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 100కంటే ఎక్కువ తాలూకాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే రైతుల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక దానిమ్మ, చెరకు రైతులు దాదాపు రూ.500 వరకు అప్పుల భారాన్ని మోస్తున్నారని, వీరి అప్పులకు సంబంధించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం 25శాతం, కేంద్ర ప్రభుత్వం 75శాతం భరించాలని కోరారు. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నామని తెలిపారు.
అంతేకాక రైతులకు అవసరమైన ఎలాంటి చర్యలు చేపట్టేందుకైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కరువు నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలను సబ్సిడీ ధరల్లో అందజేయాలని కోరారు. ఇక లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్‌రావు నియామకం సమయంలో శెట్టర్ అవకతవకలకు పాల్పడ్డారన్న మంత్రి టి.బి.జయచంద్ర వ్యాఖ్యలపై జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్‌రావు నియామకం తన హయాంలోనే జరిగినప్పటికీ ఆ నిర్ణయం కేవలం తనది మాత్రమే కాదని అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతలతో సహా హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి, స్పీకర్‌ల సలహా మేరకే భాస్కర్‌రావు నియామకం జరిగిందని పేర్కొన్నారు.
రైతు రుణాలు మాఫీ చేయండి
Published Sun, Aug 9 2015 3:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement