రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
పాఠశాలలు, పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు
పాఠశాలలోనే భోజనం..
నాణ్యత లేమిపై అసంతృప్తి
ప్రహరీ నిర్మాణంపై కాంట్రాక్టర్‌కు ఆదేశాలు
నెక్కొండ : నూతనంగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాలో పరిపాలన పరంగా విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. నెక్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించిన ఆయన అక్కడికక్కడే తగిన సూచనలు చేశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని బాధ్యులకు హితవు పలికారు. పనుల విషయంలో కాంట్రాక్టర్లపై వెంట వెంటనే ఫోన్‌లో ఆదేశాలు ఇవ్వడం విశేషం.
పథకాలను చేరువ చేయాలి
తనిఖీల సందర్భంగా కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు చేరువయ్యేలా అధికారులు పాటుపడాలని సూచించారు. ప్రజలందరినీ చైతన్యం చేయడంతో యువకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు కృషి చేసి మెరుగైన సమాజానికి తోడ్పాటునందించాలని కోరారు.
అనంతరం పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో రికార్డులను పరిశీలించిన ఆయన ప్రహరీ విషయమై కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం నెక్కొండ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల సమయపాలన, బోధన తీరుపై విద్యార్థులతో మాట్లాడారు.
అక్కడే మధ్యాహ్నం భోజనం చేసిన కలెక్టర్.. నాణ్యత లేదని గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైస్కూల్‌లో మరుగుదొడ్ల సమస్యను ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ చెప్పగా.. స్పందించిన కలెక్టర్ నెల రోజుల్లో నిధులు మంజూరు చేరుుస్తానని తెలిపారు. ఆ తర్వాత నెక్కొండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పాటిల్ రోగులతో మాట్లాడారు.
ప్రజలకు సేవలందించడంలో ప్రభుత్వ ఆస్పత్రులు ముందు నిలిచేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. కాగా, తొలిసారి నె క్కొండకు వచ్చిన కలెక్టర్‌కు ఎంపీపీ అజయ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్ నబీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, నెక్కొండ తహసీల్దార్ కె. శ్రీనివాస్, ఎంపీడీఓ గోల్కొండ కృష్ణప్రసాద్, ఏ ఎస్సై కట్టమల్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జి.సోమయ్య, వైఎస్ ఎంపీపీ డి.సారంగపాణి, నాయకులు టి.శివకుమార్, వి.రాజ్‌కుమార్, లింగ్యానాయక్, వాగ్యానాయక్, సూరం రాజిరెడ్డి, సంగని సూరయ్య, చల్లా వినయ్‌రెడ్డి పాల్గొన్నారు.