
కొడనాడులో బీభత్సం
► సెక్యూరిటీ గార్డు హత్య
► ఆసుపత్రిలో మరోగార్డు
► డాక్యుమెంట్లు, నగలు, నగదుతో ఉడాయింపు
► న్యాయవిచారణకు స్టాలిన్ డిమాండ్
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్ దోపిడీ, హత్య దురాగతాలతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో ఓం బహదూర్(50) అనే సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోగా, కిషన్ బహదూర్ అనే మరో సెక్యూరిటీ గార్డు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. జయలలిత ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగలు, నగదు దోపిడీకి గురైనట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలోని కొడనాడులో జయలలితకు సొంతమైన 1600 ఎకరాల ఎస్టేట్, తేయాకు తోటలు ఉన్నాయి. ఈ ఎస్టేట్‌కు శశికళ, ఇళవరసి, సుధాకర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. 1991–96 మధ్య కాలంలో జయలలిత సీఎంగా ఉన్న కాలంలో ఈ ఎస్టేట్ కొనుగోలు చేశారు. సాధారణ స్థాయిలో ఉన్న ఆ ఎస్టేట్‌ను జయ కొన్న తరువాత అనేక వసతులతో కూడిన బ్రహ్మాండమైన భవనంగా తీర్చిదిద్దారు. తేయాకు తోటల మధ్యలో రెండు బంగ్లాలు ఉండగా వాటిల్లో ఒకటి పాతది. మరొకటి 55 వేల చదరపు అడుగుల్లో 99 గదులతో కూడిన లగ్జరీ భవంతి. ఇక్కడ హెలిపాడ్, బోట్‌షికారు, మినీ థియేటర్, అద్దాల భవంతి, ఎస్టేట్ తిరిగి చూసేందుకు బ్యాటరీ కార్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.
జయలలిత తరచూ ఈ కొడనాడు ఎస్టేట్‌లో కొద్దికాలం విశ్రాంతి తీసుకునేవారు. సీఎంగా ఉన్నపుడు కొడనాడు ఎస్టేట్‌కే అధికారులను పిలిపించుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ మినీ సచివాలయంగా మార్చేవారు. తనకు అత్యంత సన్నిహితులను మినహా ఎవ్వరినీ లోనికి ప్రవేశించలేని రీతిలో బంగ్లా చుట్టూ ఉండే 13 ప్రవేశద్వారాల వద్ద 24 గంటలూ తమిళనాడు పోలీసులు, జెడ్ కేటగిరీ బందోబస్తుగా బ్లాక్ కమెండోలను ఉంచారు. అంతేగాక జయలలిత ఎక్కువగా వినియోగించే 8, 9, 10 నెంబరు గల వీవీఐపీ గేట్ల వద్ద మరింత గట్టి బందోబస్తు ఉండేది. ఈ ఎస్టేట్ భవనంలో జయలలిత, ఆమెకు సొంతమైన వారి డాక్యుమెంట్లు భద్రం చేసిఉన్నట్లు తెలుస్తోంది.
తిరుప్పూరు ఎన్నికల సమయంలో మూడు లారీ కంటైనర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.540 కోట్లు కొడనాడు ఎస్టేట్ నుంచే ఆంధ్రాకు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. జయలలిత మరణం తరువాత ఎస్టేట్‌లోని పోలీసు బందోబస్తును ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్టేట్ సెక్యూరిటీ గార్డులు నాలుగు నెలలుగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అన్ని ప్రవేశద్వారాల వద్ద ఇద్దరు చొప్పున నేపాల్‌కు చెందిన గూర్ఖాలు 24 గంటలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జయలలిత రాకపోకలు సాగించే 10వ మెయిన్‌గేటు వద్ద ఆదివారం రాత్రి ఎప్పటిలాగే ఓం బహదూర్ (50), కిషన్ బహదూర్ (38)లు విధులు నిర్వర్తిస్తున్నారు.
సోమవారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో రెండు కార్లతో గుర్తుతెలియని పది మంది వ్యక్తులు ఎస్టేట్‌లోకి జొరబడ్డారు. గార్డులపై వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. ఓం బహదూర్ కాళ్లూ చేతులు కట్టివేసి నరకడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. కిషన్ బహదూర్ స్పృహ తప్పడంతో చనిపోయాడని భావించిన దుండగులు అతన్ని సమీపంలోని చెట్టుకు కట్టివేశారు. బంగ్లా అద్దాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. కిషన్ బహదూర్ మూలుగులు విని దగ్గరకు వచ్చిన మరోగేటు సెక్యూరిటీ గార్డులు వెంటనే ఇతర గేట్ల వద్దనున్న వారిని అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే దుండగులు బంగ్లాలోని అత్యంత ముఖ్యమైన పత్రాలు, నగలు, రత్నాలు, వైఢూర్యాలు, పెద్ద ఎత్తున నగదుతో ఉడాయించినట్లు తెలుస్తోంది
నీలగిరి జిల్లా కలెక్టర్ శంకర్, ఎస్పీ మురళీ రంభ తదితర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎస్టేట్ చుట్టూ 200 మంది పోలీసులను మోహరింపజేశారు. మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించలేదు. పోలీసు జాగిలం జెన్నీని తీసుకురాగా రెండు కిలోమీటర్లు పరుగులు పెట్టింది కానీ ఎవ్వరినీ గుర్తించలేదు. ఆదివారం సాయంత్రం కొందరు యువకులు విద్యార్థుల్లా బొలెరో జీపులో సంచరించినట్లు తెలుసుకుని ఆరా తీస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో అదనపు బందోబస్తు పెట్టి వాహనాల తనిఖీలు చేపట్టారు. లాడ్జీలు, కాటేజీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
తమపై మత్తు మందుజల్లి మారణాయుధాలతో దాడికి దిగారని, తాను చనిపోయినట్లు భావించి చెట్టుకు కట్టి వదిలేశారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిషన్ బహదూర్ పోలీసులకు తెలిపాడు. నిందితులను పట్టుకునేందుకు ఐదుగురితో కూడిన పోలీసు బృందాన్ని ఎస్పీ నియమిచారు. అన్నాడీఎంకేలోని అధికార వర్గం శశికళ, దినకరన్‌లను దూరం పెట్టడం, పన్నీర్‌సెల్వం వర్గంతో విలీనానికి సిద్ధమవుతూనే విమర్శలకు పాల్పడుతున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
కొడనాడు ఎస్టేట్‌పై న్యాయవిచారణ
జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వ్యవహారాలపై న్యాయ విచారణ జరపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. తిరువారూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ అధ్యక్షుడు కరుణానిధి తరఫున ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం నియోజకవర్గంలో పర్యటించిన స్టాలిన్ మాట్లాడుతూ కొడనాడులో జరిగిన హత్య రాష్టంలో శాంతిభద్రతల స్థితికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. కొడనాడు ఎస్టేట్ ఎవరి స్వాధీనంలో ఉందనేది జయ మరణంలా మిస్టరీగా మారినందున న్యాయవిచారణ జరిపి తీరాలని ఆయన అన్నారు.