సాక్షి, ముంబై: పరిశ్రమలు, వాణిజ్య కార్యాలయాలు, నివాస సముదాయాల్లో (నీటిని శుద్ధి చేసి పునర్వినియోగానికి అనువుగా తీర్చిదిద్దడం) రీసైక్లింగ్ వాటర్‌ప్లాంట్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భావిస్తోంది. ముంబైలో రోజురోజుకూ నీటి వినియోగం తీవ్రతరమవుతోంది. జలాశయాల్లో మాత్రం తగినన్ని నీటి నిల్వలు లేకపోవడంతో సరఫరాలు అరకొరగానే ఉంటున్నాయి. భవిష్యత్‌లో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చేందుకు ఆస్కారముందని గ్రహించిన బీఎంసీ ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై గతంలోనే అనేక ప్రకటనలు చేసింది. ప్రజల నుంచి తగినంత స్పందన రాకపోవడంతో ఆ ఆలోచన మానుకుంది.
ఈ విషయాన్ని ఇప్పడు తీవ్రంగా పరిగణిస్తున్న బీఎంసీ నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటును తప్పనిసరి చేయాలని అనుకుంటోంది. వీటి ప్రాధాన్యం గురించి అపార్టుమెంట్లు, భారీ భవనాల వాసులకు అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతిరోజు ముంబైకర్లకు సరఫరా అవుతున్న దాంట్లో కేవలం 20-30 శాతం నీటిని తాగేందుకు వాడుతున్నారు. మిగతా 70-80 శాతం నీరు వివిధ అవసరాలకు వాడుతున్నట్లు బీఎంసీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 50 శాతం నీటిని శుద్ధి చేసుకొని తాగడం మినహా ఇతర పనులకు వినియోగిస్తే భవిష్యత్‌లో నీటి కొరత సమస్య తలెత్తే ఆస్కారముండబోదని బీఎంసీ భావిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలు, వాణిజ్య, కార్పొరేట్ కార్యాలయాల్లో కొన్ని మాత్రమే ట్యాంకర్ల నీటిని ఇతర అవసరాలకు వాడుతున్నాయి.
మెజారిటీ సంస్థలు బీఎంసీ సరఫరా చేస్తున్న నీటినే తాగేందుకు ఉపయోగిస్తున్నాయి. బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్లు, పరిశ్రమల్లో డయింగ్ పనులకు కూడా వినియోగిస్తున్నాయి. ప్రతిరోజు మిలియన్ లీటర్ల నీరు ఇలా వివిధ పనులకు వాడుకోవడంవల్ల జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వేసవిలో నీటి కొరత తలెత్తడంతో గత్యంతరం లేక బీఎంసీ సరఫరాలో కోతలు విధిస్తోంది. ఇదిలా ఉండగా రెండు వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే కాలనీలు, లేదా 80కిపైగా కుటుంబాలు లేదా రోజుకు 60 వేల లీటర్ల నీరు సరఫరా అయ్యే కాలనీల్లో నీటిశుద్ధి ప్లాంటు ఏర్పాటును కచ్చితం చేయనున్నారు. భవనాల బెస్‌మెంట్లు లేదా డాబాలపై ఈ ప్లాంట్లు ఏర్పాట్లు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది. వీటితో శుద్ధి చేసిన నీటిని తాగేందుకు మినహా స్నానాలకు, బాత్‌రూమ్‌లు, టాయిలెట్లో, వాహనాలు శుభ్రం చేసేందుకు, నేలను కడిగేందుకు, భవనాల ఆవరణలో ఉన్న ఉద్యానవనాల్లో వివిధ పనులకు వాడుకునేందుకు ఉపయోగించుకోవచ్చని బీఎంసీ పేర్కొంది.
పెద్ద భవనాల్లో నీటిశుద్ధి ప్లాంట్లు
Published Sat, Sep 14 2013 12:16 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
Advertisement