సాక్షి, ముంబై: బిచ్చగాళ్ల వెసులుబాటుకోసం నగర పాలక సంస్థ (బీఎంసీ) ఏడాది క్రితం నగరంలో నిర్మించిన వసతి గృహం ఇప్పటికీ వారికి అందుబాటులోకి రాలేదు. దాదాపు 850 మంది బిచ్చగాళ్లు ఉండేవిధంగా ఈ వసతిగృహాన్ని నిర్మించారు. దీని వైశాల్యం 6,700 చదరపు మీటర్లు.వంట గది కూడా చాలా విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా అత్యవసర సమయంలో బిచ్చగాళ్లకు ప్రాథమిక పరీక్షలు జరిపేందుకు చిన్నపాటి ఆస్పత్రిని కూడా అక్కడే నిర్మించారు. ఇందులో 40 పడకలు అందుబాటులో ఉంటాయి.
అంతేకాకుండా అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అనేక సదుపాయాలు కల్పించారు. అందులోని భారీ హాలులో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు వినోదం కోసం ఓ టీవీని కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా వివిధ అవసరాలతో కూడిన అతి పెద్ద వంట గది, ప్రత్యేక స్నానాల గదులు, వికలాంగులకు ప్రత్యేక ర్యాంప్‌లు కూడా ఏర్పాటు చేశారు. బంధువులు వచ్చినప్పుడు కూర్చోవడానికి పచ్చికలో సీట్లు, అంతేకాకుండా వాకింగ్ చేయడానికి అతిపెద్ద గార్డెన్ వసతి కూడా ఉంది.
ఈ భవన నిర్మాణానికి 2008లో అనుమతి లభించింది. 2011లో పనులను ప్రారంభించారు. గత ఏడాది పనులు పూర్తయ్యాయి. అయినప్పటికీ అప్పటి నుంచీ ఈ భవనం నిరుపయోగంగానే పడి ఉంది. ఇదిలాఉంచితే బిచ్చగత్తెల కోసం దీని పక్కనే రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ భవన నిర్మాణం చివరి దశలో ఉంది. వచ్చే నెలాఖరుకు పనులు పూర్తయ్యే అవకాశముందని బీఎంసీ అధికారి గౌతమ్ అగర్వాల్ తెలిపారు. ఈ భవనం ప్రస్తుతం ప్రజాపనుల శాఖ అధీనంలో ఉందని, తమ అధీనంలోకి రాగానే బిచ్చగాళ్లను అనుమతిస్తామన్నారు.
నిర్మించి ఏడాది వసతి కల్పించేదెన్నడో?
Published Sat, Mar 29 2014 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement