
ప్రతీకాత్మక చిత్రం
కేరళ: ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాలు అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉన్న మృత్తువు ఏదో ఒక రూపంలో కబళిస్తోంది. ఒకవేళ ప్రమాదాలు జరిగినా సమయానికి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తే ఎంతో కొంతప్రమాదాన్ని నివారించగలుగుతాం. ఐతే ఇక్కడొక వ్యక్తిని అంబులెన్స్‌లో సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లినా అక్కడ అంబులెన్స్ డోర్‌లు ఓపెన్ కాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే.... కేరళలోని ఫెరోక్‌కు చెందిన 66 ఏళ్ల కోయమోన్ అనే వ్యక్తికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వ్యక్తి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. వెనువెంటనే అంబులెన్స్ వచ్చి నిర్ణీత సమయానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కి తీసుకువచ్చింది కూడా. ఐతే క్షతగాత్రుడిని చికిత్స వార్డుకి తరలిద్దాం అనుకుంటే అంబులెన్స్ డోర్‌లు ఎంతకి ఓపెన్ కాలేదు.
ఆఖరికి ఆస్పత్రి సిబ్బంది మొత్తం ప్రయత్నించినప్పటికీ... సుమారు అరగంట వరకు వ్యాన్ డోర్‌లు ఓపెన్ గాక చాలా ఇబ్బందిపడ్డారు. చివరికి డోర్‌కు ఉండే అద్దాలు పగలుగొట్టి లోపలి నుంచి డోర్‌లు ఓపెన్ చేశారు. ఈ ఆలస్యం కారణంగా సదరు క్షతగాత్రుడు మృతి చెందాడు. అయితే అంబులెన్స్ డోర్‌లు తెరుచుకోకపోవడమే ఆ వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.
(చదవండి: ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్)