♦ హోం శాఖ సహాయ మంత్రి రంజిత్ పాటిల్
♦ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికేనని వెల్లడి
♦ ఆరు నెలల్లో కొత్త పాలసీ అమల్లోకి
ముంబై : ఆదాయం కోసం డవలపర్లు ప్రభుత్వ భూములను ఉపయోగించడాన్ని నిరోధించడానికి నౌకాశ్రయ విధానాన్ని (పోర్ట్ పాలసీ) సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘పోర్టు భూములను అభివృద్ధి చేస్తామని చెప్పి డవలపర్లు పీపీపీ పద్ధతిన బిడ్లు వేసి, ఏళ్లయినా వాటి గురించి పట్టించుకోవడం లేదు. 15- 20 ఏళ్లపాటు ఆ భూములను అంటిపెట్టుకుని తర్వాత అమ్మేస్తారు. ఇలా చేసి భారీ ఆదాయం సంపాదిస్తారు. కానీ ఎలాంటి అభివృద్ధి చేయరు’ అని హోం శాఖ సహాయ మంత్రి రంజిత్ పాటిల్ అన్నారు. పోర్ట్ పాలసీకి సంబంధించి పలు ఏజెన్సీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘పోర్ట్ పాలసీని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోర్టు భూములను సొంతం చేసుకున్న డవలపర్లు నిర్ణీత కాల వ్యవధిలోగా వాటిని అభివృద్ధి చేసేలా సవరణ చేస్తాం. ఒక్క సారి పీపీపీ పద్ధతి ద్వారా స్థలం దక్కించుకున్న డవలపర్లు, తర్వాత అభివృద్ధి చేయడానికి మాత్రం కుంటిసాకులు చూపుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటివి చెల్లవు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఈ మేరకు అనుమతి తీసుకుంది. భూములను సొంతం చేసుకున్న నిర్ణీత వ్యవధిలోగా అభివృద్ధి చేసి తీరాల్సిందే’ అని పాటిల్ వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రారంభ దశలోనే ఉందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే డ్రాఫ్టు బిల్లుతో ముందుకొస్తామని పేర్కొన్నారు. ‘ఇప్పటికే భూములను సొంతం చేసుకున్న వారు సైతం వాటి అభివృద్ధి పనులు ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం’ అని హెచ్చరించారు. 6 నెలల్లో కొత్త పాలసీ అమల్లోకి తెస్తామని తెలిపారు.
నౌకాశ్రయ విధానాన్ని సవరిస్తాం
Published Sat, Aug 22 2015 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement