వినుప్రియ విషాదానికి కారకులు ఎవరు? | Who is responsible for the death of vinupriya | Sakshi
Sakshi News home page

వినుప్రియ విషాదానికి కారకులు ఎవరు?

Published Wed, Jun 29 2016 8:16 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Who is responsible for the death of vinupriya

- ఏకపక్ష ప్రేమికుడా, పట్టించుకోని పోలీసా?
-విషాదంతో ముగిసిన వినుప్రియ జీవితం
-ప్రేమికుడి అరెస్ట్
-హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

సాక్షి ప్రతినిధి, చెన్నై

 ప్రేమ అనే మధురమైన రెండక్షరాలు యువతీయువకుల జీవితాలను అందమైన మలుపు తిప్పగలవు. పెళ్లిపీటల వరకు నడిపించి నిండు నూరేళ్లు బతకాలన్న ఆశలను చిగురింపజేయగలవు. అవే రెండక్షరాలు ఏకపక్షమైతే ఓ నిండు జీవితాన్ని ఆదిలోనే నిర్దాక్షిణ్యంగా ఆర్పేయగలవు. ప్రేమ ముసుగులో ఓ మృగాడు సాగించిన వికృతచేష్ట వినుప్రియ అనే ఉపాధ్యాయురాలి జీవితాన్ని చిదిమేసింది. వినుప్రియ (20) బలవన్మరణానికి బాధ్యులు ఎవరు? మార్ఫింగ్‌కు పాల్పడిన ఏకపక్ష ప్రేమికుడా? ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసా? అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది.


తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ. పేదింటిలో పుట్టినా టీచర్‌గా జీవించాలని ఆశపడింది. బీఎస్సీ పాసై సమీపంలోని ఓ పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా చేరింది. హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలు ఆందోళనను రేకెత్తించాయి. ఈనెల 17వ తేదీన ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం జరగడంతో అవమానభారంతో కుంగిపోయిన వినుప్రియ తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించింది. కుమార్తెను ఓదార్చిన తండ్రి అన్నాదురై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వెంటనే సదరు ఫేస్‌బుక్ ఐడీని బ్లాక్ చేయాలని, నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరాడు.

 

అయితే అక్కడి సిబ్బంది ఈ ఫిర్యాదును సర్వసాధారణంగా తీసుకోవడంతో పాటూ హేళనగా మాట్లాడారు. ఐడీని బ్లాక్ చేయగల సర్వర్ విదేశాల్లో ఉంటుంది. ఇందుకు 20 రోజులు పడుతుందని తాపీగా సమాధానం ఇచ్చారు. అన్నాదురై అక్కడి నుంచి సైబర్‌క్రైం పోలీసుల వద్దకు వెళ్లి వేడుకున్నాడు. సిమ్‌కార్డు వేసి మాట్లాడేందుకు వీలుగా ఒక సెల్‌ఫోన్ కొనివ్వమని సైబర్‌క్రైం పోలీసు హెడ్‌కానిస్టేబుల్ సురేష్ డిమాండ్ చేశాడు. కుమార్తెకు న్యాయం జరుగుతుందని ఆశతో అన్నాదురై రూ.2,350 ఖర్చుచేసి వెంటనే సెల్‌ఫోన్ కొనిచ్చాడు. సెల్‌ఫోన్‌ను లంచంగా పుచ్చుకున్న సురేష్ దానిని వినుప్రియ కేసు విచారణకు ఉపయోగించకుండా ఇంట్లో ఇచ్చాడు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. రోజులు గడుస్తున్నా ఫేస్‌బుక్ అకౌంట్ బ్లాక్ చేయలేదు.

 

అంతే ఈనెల 26వ తేదీన మరోసారి వినుప్రియ అశ్లీల ఫొటో, అన్నాదురై ఫోన్ నంబరు సహా అదే ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైంది. హతాశయులైన తల్లిదండ్రులు అన్నాదురై, మంజుల ఫిర్యాదు చేసిన పోలీసుల వద్దకు మళ్లీ పరుగులు తీశారు. తనకు, తనవారికి జరిగిన అవమానాన్ని భరించలే క పోయిన వినుప్రియ తల్లిదండ్రులు పోలీసుల కోసం వెళ్లగానే ఆదివారం (26వ తేదీ) సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. ‘మీరంతా ముందు నన్ను క్షమించండి, నా జీవితమే నాశనం అయిన తర్వాత జీవించి ప్రయోజనం ఏమిటి. నాకు జీవించాలని లేదు. నిజం చెబుతున్నా నా ఫొటోలు ఎవ్వరికీ పంపలేదు.

 

ఏ తప్పూ చేయలేదు. బిలీవ్ మీ వన్స్ ఎగైన్. సారీ..సారీ’ అంటూ ఆమె మృతదేహం సమీపంలో దొరికిన ఒక ఉత్తరం వినుప్రియ హృదయఘోషకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఫేస్‌బుక్ ఐడీని బ్లాక్ చేయడానికి 20 రోజుల సమయం పడుతుందని నిర్లక్ష్యం వహించిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు చేసుకున్న కొన్ని గంటల్లోనే బ్లాక్ చేయగలిగారు. మూడో రోజునే నిందితుడిని అరెస్ట్ చేయగలిగారు. ఫిర్యాదు అందగానే పోలీసులు చర్య తీసుకుని ఉంటే మరోసారి అశ్లీల ఫొటోలు ప్రచారమయ్యేవి కావు, వినుప్రియ ప్రాణాలు పోయేవికావు.


ప్రేమించలేదని..
ప్రేమోన్మాదాన్ని తలకెక్కించుకున్న సురేష్ అనే యువకుడే వినుప్రియ ప్రాణాలను హరించి వేసినట్లు తెలుస్తోంది. సేలం జిల్లా కల్‌పారాపట్టికి చెందిన సురేష్ తనను ప్రేమించమంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో వినుప్రియ వెంట పడేవాడు. ఆమె అనేక సార్లు వారించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మరోసారి హెచ్చరించింది. దీంతో ఏకంగా ఆమె ఇంటికే వచ్చి పెద్దలను సంప్రదించాడు. వినుప్రియ తల్లిదండ్రులు సురేష్‌ను వారించి పంపివేశారు. తన ప్రేమను నిరాకరిస్తావా అంటూ ఆమెను బెదిరించాడు. సమాజంలో ఆమె పరువు పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. వినుప్రియ ఫొటోను ఎలాగో సంపాదించి మరో అశ్లీల ఫొటోకు జోడించాడు. బుధవారం అరెస్టయిన సురేష్ పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు.

 

ఆత్మహత్యకు కారకుడైన సురేష్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఆరు కేసులు పెట్టారు. సెల్‌ఫోన్ లంచంగా తీసుకున్న హెడ్‌కానిస్టేబుల్ సురేష్‌ను సస్పెండ్ చేశారు. ఇంత చేసిన పోలీసులు ఆమె ప్రాణాలను తెచ్చివ్వగలరా? వినుప్రియ ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితునిపై పోలీసులు కేసు పెట్టారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించక నిర్లక్ష్యం వహించి వినుప్రియ ఆత్మహత్యకు మరో కోణంలో కారకులైన పోలీసులపై కేసులు పెట్టేవారు ఎవరు? పోలీసుల ముసుగులో ఉన్న నిందితులను శిక్షించేవారెవరు?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement