ఆస్తి కోసం శ్రీలంక మహిళ హైడ్రామా!  | Srilanka Women Made High Drama For Property In Chennai | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం శ్రీలంక మహిళ హైడ్రామా! 

Published Wed, Jul 1 2020 7:36 AM | Last Updated on Wed, Jul 1 2020 7:57 AM

Srilanka Women Made High Drama For Property In Chennai - Sakshi

సాక్షి, చెన్నై : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి.. శ్రీలంకకు చెందిన మహిళ  ఆస్తి కోసం  దేశాలు దాటి పెళ్లి చేసుకున్న భర్తను మట్టుబెట్టి ఆపై రక్తికట్టించిన హైడ్రామా గుట్టును తిరుచ్చి పోలీసులు రట్టు చేశారు. అందాన్ని అడ్డం పెట్టుకుని ఆమె తొక్కిన అడ్డదారులన్నీ విచారణలో వెలుగు చూశాయి. తిరుచ్చి– సమయనల్లూరు జాతీయ రహదారిలో రెండు రోజుల క్రితం కారులో వెళ్తున్న యూసఫ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి హతమార్చారు. పట్టపగలు సాగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేగడంతో పోలీసులు కేసును సవాల్‌గా తీసుకున్నారు. అదే సమయంలో పోలీసు స్టేషన్‌కు నలుగురు న్యాయవాదుల్ని వెంటేసుకొచ్చిన శ్రీలంకకు చెందిన హసీనా ఇచ్చిన సమాచారం పోలీసుల విచారణకు కీలకంగా మారింది.

యూసఫ్‌కు తాను రెండో భార్య అని, తామిద్దరం కువైట్‌లో ఐదేళ్ల క్రితం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుని తంజావూరులో కాపురం పెట్టామని వివరించారు. తనకు ఇటీవలే ఓ సమాచారం తెలిసిందని, ఇది వరకే యూసఫ్‌కు పెళ్లి జరిగిందని, అనేక మంది యువతులతో అతడికి సంబంధాలు ఉన్నట్టు ఆరోపించారు. ఈ హత్య వారిలో ఎవరైనా చేయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సదరు మహిళ న్యాయవాదులతో వచ్చి మరీ ఇచ్చిన సమాచారం పోలీసుల్లో అనుమానాల్ని రెకెత్తించాయి. ఆమె ఇచ్చిన వివరాల్ని నమోదు చేసుకుని ఆ దిశగా  కేసు విచారణ మీద దృష్టి చేపట్టారు. 

ఆస్తి కోసం.. 
అనేక మంది యువతుల్ని యూసఫ్‌ మోసం చేస్తుండడంతోనే వారి జీవితాల్ని కాపాడేందుకు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవాల్సి వచ్చినట్టుగా ఆమె ఓ కథ చెప్పినా, నమ్మే స్థితిలో లేమంటూ ట్రీట్‌మెంట్‌ తీవ్రతను పెంచగా అస్సలు గుట్టును విప్పింది. వివరాలు.. యూసఫ్‌ పేరిట అనేక చోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు లాకర్లలో మూడు వందల సవర్లకు మేరకు నగలు, నగదు ఉన్నట్టు హసీనా గుర్తించింది. వాటిని దక్కించుకునేందుకు అందాన్ని అడ్డం పెట్టుకుని  అడ్డదారుల్ని తొక్కే పనిలో పడింది. ఫేస్‌బుక్‌లో తనకు పరిచమైన నలుగురు యువకుల్ని ఎంపిక చేసుకుంది. వారితో సన్నిహితం పెంచుకుంది. అంతేకాదు మరో నలుగురు న్యాయవాదుల్ని వలలో వేసుకుంది. వీరి ద్వారా యూసఫ్‌ ఖాతా ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌కు మరింతదగ్గరయ్యింది.

తొలుత బ్యాంక్‌ మేనేజర్‌ మారం చేసినా, తదుపరి హసీనాకు దాసోహమయ్యాడు. బ్యాంక్‌ లాకర్లలో ఉన్న దస్తా వేజులు, నగలు, నగదు అన్నీ హసీనా తన సొంతం చేసుకుంది. ఈ సమాచారం ఓ మిత్రుడి ద్వారా తెలుసుకున్న యూసఫ్‌ గత ఏడాది చివర్లో ఇండియాకు చేరుకున్నాడు. హసీనాతో గొడవ పడ్డాడు. ఆమెను దూరం పెట్టాడు. విడాకుల నోటీసు పంపించాడు. చట్టపరంగానే తన ఆస్తులన్నీ మళ్లీ దక్కించుకునే సిద్ధమయ్యాడు. ఇవన్నీ యూసఫ్‌ కూడా గుట్టచప్పుడు కాకుండా, తన పరువు పోకుండా జాగ్రత్తపడుతూ ముందుకు సాగాడు.

ఇవన్నీ తనకు అనుకూలంగా మలచుకున్న హసీనా ఫేస్‌ బుక్‌ ప్రియులు, న్యాయవాదుల సహకారంతో ఓ కిరాయి ముఠాను ఆశ్రయించింది. రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని యూసఫ్‌ను మట్టుబెట్టేందుకు పథకం రచించింది. లాక్‌డౌన్‌ కారణంగా మర్డర్‌ ప్లాన్‌ ఆలస్యం అయింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం పథకం ప్రకారం హతమార్చి, మొదటి భార్య మీద నిందల్ని వేయడానికి యత్నించి అడ్డంగా బుక్కైంది. హసీనాతో పాటుగా నలుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు కేసు విచారణను మరింత ముమ్మరం చేశారు. యూసఫ్‌ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న ఫెస్‌బుక్‌ ప్రియులు, సలహా ఇచ్చిన న్యాయవాదుల కోసం వేట సాగుతోంది.

వెలుగులోకి హైడ్రామా.. 
దుబాయ్, కువైట్‌లలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న యూసఫ్‌కు తిరుచ్చిలో భార్య పిల్లలు ఉన్నట్టు తేలింది. విదేశాల్లో శ్రీలంకకు చెందిన హసీనా మీద మోజుపడ్డ యూసఫ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హసీనాతో తంజావూరులో కాపురం పెట్టగా, తిరుచ్చిలో మొదటి భార్య, పిల్లల్ని ఉంచాడు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా ఇద్దరికీ న్యాయం చేస్తూనే వచ్చాడు. ఎక్కువ సమయం హసీనా ఇంట్లోనే గడిపేవాడు. ఈ హత్య మొదటి భార్య తరఫు వాళ్లే చేయించి ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తును పోలీసులు తీసుకెళ్లారు. అటు వైపుగా అంత సమర్థులెవ్వరూ లేరని తేలింది. హసీనాను పిలించిని మహిళా పోలీసులతో స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంతో గుట్టరట్టయ్యింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement