
దిగంబర పూజలు చేస్తున్నాడు: భార్య ఫిర్యాదు
బయటపెట్టిన రెండో భార్య
టీ.నగర్: వైద్య కళాశాల ప్రిన్సిపల్ కావాలని కోరుతూ ఇంటిలో నగ్న పూజలు నిర్వహించిన ప్రొఫెసర్ వింత వైఖరి వెలుగులోకి వచ్చింది. ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు దీపక్. ఈయన మొదటి భార్య మృతి చెందడంతో సేలం జిల్లా ఆడయాంపట్టికి చెందిన మరొక యువతిని రెండో వివాహం చేసుకున్నారు. ఈమె కూడా ఇది వరకే వివాహమై భర్తను కోల్పోయింది. ఈ క్రమంలో నగ్న పూజలో పాల్గొనాలనిభర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఆరోపిస్తూ ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
దీని గురించి ఆమె మాట్లాడుతూ తమ వివాహానంతరం తరచూ పూజలు చేయాలని భర్త బయటికి వెళ్లి వస్తుండేవాడని ఆరంభంలో దీనిని తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. కాలక్రమంలో ఇంటిలోనే నగ్నంగా కూర్చొని పూజలు ప్రారంభించారన్నారు. తాను ఇటువంటి పూజలు చేయడం సరికాదని అనేక సార్లు తెలిపినప్పటికీ అతను పట్టించుకోవడం లేదని తనను దిగంబర పూజల్లో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది.
దీంతో తమ మధ్య తరచుగా తగాదాలు జరిగేవన్నారు. దాంతో తాను తరచూ పుట్టింటికి వచ్చేదాన్నని, ఈ క్రమంలో తనకు విడాకుల నోటీసు పంపారన్నారు. దిగ్భ్రాంతి చెందిన తాను కుటుంబసభ్యులతో ధర్మపురికి వెళ్లానని ఆ సమయంలో కూడా అతను నగ్న పూజల్లో పాల్గొనడం ఆందోళన కలిగించిందన్నారు. అదే సమయంలో దీని గురించి నిలదీయగా తనపై దాడి చేశాడని దీంతో చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు. తన భర్త దిగంబర పూజ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోలను ఆమె విడుదల చేసింది.