మారుతున్న వాతావరణంతో పెరుగుతున్న అంటువ్యాధులు
ఆస్పత్రుల్లో పెరుగుతున్న చికున్‌గన్యా, డెంగీ రోగుల సంఖ్య
ఫాగింగ్ కూడా చేపట్టని అధికారులు రెండు నెలల్లో 374 చికున్ గన్యా, 548 డెంగీ కేసుల నమోదు
బెంగళూరు: విజృంభిస్తున్న వర్షాలు, దోమల తీవ్రత, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, చికున్ గన్యా లాంటి వ్యాధులకు చిక్కిన ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు నగరంలోకూడా ఇదే పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో చెత్త నిర్వహణ అధ్వానంగా మారింది. పేరుకుపోతున్న చెత్త, ఇందుకు తోడవుతున్న చిరుజల్లులు వెరసి ఉద్యాననగరిలో దోమల స్వైరవిహారం పెరుగుతోంది. దీంతో నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికున్‌గన్యా, డెంగీ తదితర సమస్యలతో ఇబ్పంది పడుతున్న వారు నగరంలోని ఆస్పత్రుల వద్ద క్యూకడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో 213 చికున్‌గన్యా కేసులు నమోదు కాగా, మే-జూన్ మధ్య ఈ సంఖ్య 374కు పెరిగింది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 468 డెంగీ కేసులు నమోదు కాగా, మే-జూన్ మధ్య కాలాంలో ఈ సంఖ్య 548కు పెరిగింది. బెంగళూరు నగరంలో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 24 చికున్ గన్యా కేసులు నమోదు కాగా, మే-జూన్ కాలానికి ఈ సంఖ్య 40కు పెరిగింది. ఇక జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 29 డెంగీ కేసులు నమోదు కాగా, మే-జూన్ కాలానికి ఈ సంఖ్య 61కు పెరిగింది. కాగా, నగరంలో దోమల బెడద పెరిగిపోవడానికి బీబీఎంపీ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త నిర్వహణలో పూర్తిగా విఫలమైన బీబీఎంపీ కనీసం వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సైతం నిర్లక్ష్యం వహిస్తోందని చెబుతున్నారు. ఈ విషయంపై నగరంలోని హెచ్‌ఆర్‌బీఆర్ లే అవుట్‌కు చెందిన విక్రమ్ మాట్లాడుతూ....‘మా ప్రాంతంలో చెత్త నిర్వహణలో బీబీఎంపీ పూర్తిగా విఫలమైంది. మూడు నాలుగు రోజులకోసారి చెత్తను తొలగిస్తున్నారు. కురుస్తున్న వర్షానికి చెత్త తోడై మరీ ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. వాటి నివారణకు కనీసం ఫాగింగ్ కూడా చేయలేదు. జూన్ నెల ప్రారంభం నుంచి ఇప్పటి దాకా మా ప్రాంతంలో డెంగ్యీతో ఒకరు చనిపోగా, పది మంది ఆస్పత్రిలో చేరారు’ అని తెలిపారు. ఇక ఈ విషయంపై మస్కిటో కంట్రోల్ బీబీఎంపీ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ....‘ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్‌ను ప్రారంభించాం. దోమలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. 60శాతం మురికి వాడల్లో ఈ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేశాం’ అని చెప్పారు.