మత్తు ఇచ్చి తాళికట్టాడు !
చెన్నై: తనను ఒక యువకుడు మత్తు మందు ఇచ్చి వివాహం చేసుకున్నట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊటికి చెందిన యువతి చెన్నైలో ఒక ప్రైవేటు కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. కళాశాల ఎదుటగల ఉమెన్ హాస్టల్‌లో బసచేస్తోంది. ఈమెకు, కృష్ణగిరిలో జిమ్ నడుపుతున్న కుమార్ (27)తో పరిచయమైంది. ఇరువురూ గత కొన్ని రోజుల క్రితం కృష్ణగిరిలో తల్లిదండ్రులకు తెలియకుండా పూలదండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.
తర్వాత విడిగా ఇల్లు తీసుకుని జీవించసాగారు. సమాచారం అందుకుని రమ్యను కలిసిన ఆమె తల్లిదండ్రులు ఆమెతో చర్చించారు. ఆమెకు వేరొక చోట వరుని చూసి వివాహం చేస్తామని చెప్పి ఆమెను తీసుకువెళ్లారు. దీంతో విరక్తి చెందిన కుమార్ తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని కృష్ణగిరి జిల్లా, రాయకోట్టై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిగురించి కేసు నమోదు చేశారు.
తన భార్యను అప్పగించాలంటూ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో కుమార్ తరపున ఫిర్యాదు అందింది. అయితే రమ్య ఎగ్మూరు పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఒక ఫిర్యాదు చేసింది. అందులో కుమార్ తనను కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చారని, తరువాత తనకు తాళి కట్టి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న తాను తాళి విసిరికొట్టి చెన్నై చేరుకున్నానని పేర్కొంది. ప్రస్తుతం అతను తన వద్దకు రాకుంటే హత్య చేస్తానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. అందుచేత కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.