గూడ్స్‌లో యువతి! ... తీవ్రవాదా ?
చెన్నై: కోయంబత్తూరు నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలులో ఓ యువతి నక్కి ఉండడాన్ని చెన్నైలో భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆమె తీవ్ర వాదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన యువతిగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక కేంద్రం మదురై తీవ్రవాదుల హిట్‌లిస్టులో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరి మీదైనా సరే చిన్న పాటి అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని విచారించడం, ఆపై విడుదల చేయడం జరుగుతోంది. రైళ్లలో అనుమానిత పార్శిల్స్ వచ్చినా సరే వదలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో కాట్టుపల్లి హార్బర్‌కు వచ్చిన గూడ్స్ రైల్లో ఓ యువతి నక్కి ఉండడం చర్చనీయాంశంగా మారింది.
చెన్నై శివారులోని పొన్నేరి - మీంజూర్ సమీపంలోని కాట్టు పల్లి హార్బర్‌కు నేల బొగ్గు రవాణా అవుతోంది. ఇక్కడికి వచ్చే నేల బొగ్గును రాష్ర్టంలోని తూత్తుకుడి, మెట్టూరు, ఉత్తర చెన్నై తదితర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పంపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో కోయంబత్తూరు నుంచి చెన్నైకు ఓ గూడ్స్ రైలు వచ్చింది. ఉత్తర చెన్నై విద్యుత్ కేంద్రానికి సమీపంలో కాట్టు పల్లి వైపుగా వెళ్తున్న ఈ గూడ్స్‌లోని ఓ బోగిలో ఎవరో ఉన్నట్టుగా భద్రతా సిబ్బంది గుర్తించారు.
రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది అన్ని బోగీలను పరిశీలించారు. ఓ బోగిలో యువతి నక్కి ఉండటంతోకాసేపు ఆందోళనలో పడ్డారు. ఆమెను అదుపులోకి తీసుకుని పొన్నేరి డీఎస్పీ శేఖర్‌కు అప్పగించారు. ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు. 21 ఏళ్ల ఆ యువతి పేరు స్టాన్లీగా ఆంధ్ర వాసిగా భావిస్తున్నారు. ఆమె మెట్టూరులో గూడ్స్‌లోకి ఎక్కినట్టు తేలింది. అయితే, మెట్టూరు వద్ద ఆమె ఎలా గూడ్స్‌లో ఎక్కిందో, అక్కడి భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఎలా ప్రవేశించ గలిగిందోనన్న అనుమానాలు నెలకొన్నాయి.