యువకులపై మహిళా ఎస్‌ఐ ప్రతాపం | Woman SI thrashes youths for not wearing helmets | Sakshi
Sakshi News home page

యువకులపై మహిళా ఎస్‌ఐ ప్రతాపం

Published Thu, Mar 16 2017 3:05 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

యువకులపై మహిళా ఎస్‌ఐ ప్రతాపం

యువకులపై మహిళా ఎస్‌ఐ ప్రతాపం

మాండ్య: కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ హైవేలో సావి అనే మహిళ ఎస్‌ఐ.. ఇద్దరు యువకుల పట్ల దురుసుగా ప్రవర్తించి, దౌర్జన్యానికి పాల్పడ్డారు. మద్దూరు సమీపంలో సోమనహళ్లి గ్రామం వద్ద సావి పోలీసులతో కలసి వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నరసింహ, నిషాంత్ అనే ఇద్దరు యువకులు హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్‌పై వచ్చారు. చట్టప్రకారం హెల్మెట్ ధరించనందుకు వారికి జరిమానా విధించాలి. అయితే మహిళా ఎస్‌ఐ యువకులను దూషిస్తూ దాడి చేశారు.

మహిళా ఎస్‌ఐ బూతులు తిట్టడంతో యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సావి ఓ యువకుడి కాలర్ పట్టుకుని రెండుసార్లు చెంపదెబ్బ కొట్టారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నారని కేసు నమోదు చేశారు. కాగా ఆ సమయంలో అక్కడున్నవారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఎస్‌ఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేశారు. హెల్మెట్ వాడనందుకు తాము జరిమానా చెల్లించామని, అయినా మహిళా ఎస్‌ఐ తమను దూషించి చేయి చేసుకున్నారని బాధిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ.. ఎస్ఐ సావి దురుసుగా ప్రవర్తించడం తప్పేనని, విచారణకు ఆదేశించామని, ఆమె తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement
Advertisement