18 ఏళ్లుగా మహిళ కడుపులో కత్తెర!
శస్త్రచికిత్స చేసి తొలగించిన స్టాన్లీ ఆస్పత్రి వైద్యులు
టీనగర్: ఎవరికైనా కడుపులో ఏముంటుందని ప్రశ్నిస్తే పేగులు, అవయవాలు ఉంటాయని ఠకీమని చెప్పేస్తాం. కానీ కడుపులో కత్తెర కూడా ఉంటుందని మీకు తెలుసా ? వైద్యుల నిర్వాకానికి నిదర్శనం ఈ ఘటన. తండయార్‌పేట తిలకర్‌నగర్ సునామి క్వార్టర్స్‌కు చెందిన సరోజ (60) పూల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమెకు గతంలో డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో కత్తెరను అలాగే పెట్టి కుట్లు వేశారు. రెండేళ్ల క్రితం ఆమెకు అనారోగ్యంగా ఉండగా స్కాన్ చేసినప్పుడు కడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది.
అయితే ఆమె పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుండడంతో మళ్లీ ఆపరేషన్ చేయించుకుంటే వ్యాపారం దెబ్బతింటుందని ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచి 18 ఏళ్లుగా నొప్పిని భరించింది. పేదరికంతో ఉండడం వల్ల ఆపరేషన్ అంటే మళ్లీ ఎక్కడ డ బ్బులు ఖర్చు అవుతాయయోనని అలాగే ఉండిపోయింది. ఆమెకు శనివారం తీవ్ర కడుపునొప్పి రావడంతో స్టాన్లీ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు స్కాన్ చేయగా కడుపులో కత్తెర ఉండడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను తొలగించి ఆమెకు బాధ నుంచి విముక్తి కల్పించారు.