పెద్ద నోట్లు పనికిరావన్న భయంతో ఆత్మహత్య
పెద్ద నోట్లు పనికిరావన్న భయంతో ఆత్మహత్య
Published Thu, Nov 10 2016 11:57 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సామాన్యుల పాలిట శరాఘాతంగా మారింది. తమ దగ్గరనున్న పెద్ద నోట్లు చెల్లవన్న భయంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు దాచుకున్న సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు మహబూబాబాద్ జిల్లాలో ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. తమ దగ్గర ఉన్న రూ. 54 లక్షల రూపాయలు చెల్లవన్న భయంతో కందుకూరి వినోద(55) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శెనగపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కందుకూరి వినోద(55) భర్తకు కొంత కాలం క్రితం పక్షవాతం వచ్చింది. దీంతో తమకు ఉన్న పన్నెండెకరాల వ్యవసాయ భూమిని రూ. 56.40 లక్షలకు విక్రయించి వచ్చిన డబ్బుతో భర్తకు వైద్యం చేయించింది. వైద్యానికి రెండు లక్షలు ఖర్చుకాగా మిగిలిన డబ్బుతో మరో ప్రాంతంలో భూమి కొనడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లు చెల్లవని.. అవి చిత్తు కాగితాలతో సమానమని ప్రకటించడంతో.. భయాందోళనలకు గురైన వినోద విషయం భర్తకు, కుమారుడికి చెప్పింది. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. చెప్పిన వినకుండా భూమి మొత్తం విక్రయించడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వారు మందలించారు. దీంతో తన వద్ద ఉన్న 54 లక్షలు చెల్లని నోట్లుగా మిగిలిపోతాయని భావించిన వినోద.. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇళ్లల్లో కొద్దోగొప్పో పెద్ద నోట్లు దాచుకున్న సామాన్యులు ప్రభుత్వం నిర్ణయంతో భయాందోళన చెందుతున్నారు. శుభకార్యాలు పెట్టుకున్న వారు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఓ వ్యక్తి తన కొడుకు పెళ్లి కోసం బంగారం మీద ఈ నెల 6న బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో అతడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. బ్యాంకులు రూ. 4 వేలకు మించి ఇవ్వబోమని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు.
Advertisement