
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
టీ.నగర్, న్యూస్‌లైన్ : నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అలాంటి వారి అడుగుజాడల్లో ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు సాగాలని ఆర్యవైశ్య మహిళా రత్న పురస్కార గ్రహీత శ్రీ లక్ష్మీమోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక టీ.నగర్ పీఆర్‌సీసీ సెంటినరీ హాలు వేదికగా శనివారం తమిళనాడు ఆర్యవైశ్య మహిళాసభ ఆధ్వర్యంలో మద్రాసు యూనిట్ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ, ప్రపంచ తెలుగు సమాఖ్య, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్‌లలో విశేష సేవలందిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న లక్ష్మీమోహనరావును తమిళనాడు ఆర్యవైశ్య మహిళాసభ (మద్రాసు యూనిట్) ఆర్యవైశ్య మహిళా రత్న బిరుదుతో ఘనంగా సత్కరించారు. టీఎన్‌ఏవీఎంఎస్ అధ్యక్షురాలు శశికళా ఆంజనేయులు, సభ్యులు ఆమెకు శాలువా కప్పి మెమెంటోలు అందజేశారు.
లక్ష్మీమోహనరావు మాట్లాడుతూ సన్మానాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. డాక్టర్ గిరిజ సుజో చికిత్సా పద్ధతులపై సభ్యులకు అవగాహనా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో చివరిగా సభ కార్యదర్శి మణిమాల వందన సమర్పణ చేశారు.