సాక్షి, న్యూఢిల్లీ : మహిళా భద్రత అంటూ నానాహంగామా చేస్తున్న పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో వారికి టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం తటపటాయించాయి. మూడు ప్రధాన పార్టీలు కేవలం 19 మందికే టికెట్లు ఇచ్చాయి. అయితే మిగతా పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ టికెట్లు ఇచ్చింది. బీజేపీ తరఫున ఎనిమిది మంది, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీల తరఫున ఆరుగురు చొప్పున మహిళా అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదుగురినే బరిలోకి దింపింది. సీపీఐ తరఫున ఒకరు పోటీ చేస్తున్నారు. 2013తో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య తగ్గింది. అప్పట్లో మొత్తం 71 మంది మహిళలు పోటీచేయగా ఈసారి 63 మంది మాత్రమే బరిలో ఉన్నారు.
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా మహిళే. ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ఇద్దరు అభ్యర్థులూ మహిళలే. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల సంఖ్య కూడా తగ్గింది. గత ఎన్నికల్లో 810 మంది పోటీ చేయగా, ఈసారి బరిలో ఉన్నవారి సంఖ్య 673 మాత్రమే. బీజేపీ నిలబెట్టిన 66 మంది అభ్యర్థుల్లో 22 మంది గ్రాడ్యుయేట్లు, 11 మంది పదో తరగతి ఉత్తీర్ణులు,18 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో తొమ్మిది మంది పోస్టు గ్రాడ్య్యుయేట్లు, 29 మంది గ్రాడ్యుయేట్లు, మరో ఎనిమిదిమంది 12వ తరగతి ఉత్తీర్ణులు. ఇక ఆప్ అభ్యర్థుల్లో 21 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 24 మంది గ్రాడ్యుయేట్లు, తొమ్మిదిమంది మంది 12వ తగరతి ఉత్తీర్ణులు, ఐదుగురు పదోతరగతి ఉత్తీర్ణులు ఉన్నారు. విశ్వాస్‌నగర్ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అతుల్‌గుప్తా ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నవారందరి కంటే విద్యాధికుడు. ఆయన ఎంబీబీఎస్ పూర్తిచేశారు.
మహిళా భద్రత పేరిట పార్టీల హంగామా
Published Tue, Jan 27 2015 10:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement