మారాలి
మహిళల్లో మరింత చైతన్యం రావాలన్న వాణి శ్రీపాద, ఎన్.వరలక్ష్మి, లక్ష్మి మోహన్
ఆంధ్ర మహాసభ మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
సాక్షి, ముంబై: నేడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్న మహిళల్లో మరింత చైతన్యం రావల్సిన అవసరం ఉందని వాణి శ్రీపాద, ఎన్.వరలక్ష్మి, లక్ష్మి మోహన్‌లు పేర్కొన్నారు. ఆంధ్ర మహా సభ మహిళ మండలి ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాదర్‌లోని ఆంధ్రమహసభలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి ఎన్ .వరలక్ష్మి, ముంబై నుంచి వాణి శ్రీపాద, లక్ష్మీ మోహన్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరితోపాటు ఇతర వక్తలు మహిళల గురించి మాట్లాడారు. మహిళలల్లో మరింత చైతన్యం రావల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పురుషులు కూడా మహిళలపట్ల వ్యవహరించాల్సిన తీరును మార్చుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళల గురించి లక్ష్మి పాడిన పాట అందరిని అలరించింది. ఆడజన్మ అపురూపమైనదని, మహిళల గొప్పతనం గురించి తెలిపారు. దీంతోపాటు నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.
విశిష్ట మహిళలకు సత్కారాలు...
వివిధ రంగాల్లో గుర్తింపు పొందుతున్న విశిష్ట మహిళలకు అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రమహాసభ మహిళ శాఖ ఘనంగా సత్కరించింది. వీరిలో అనేక కచేరీలు నిర్వహించిన గాయని వరలక్ష్మి, సంఘసేవికురాలు వాణిశ్రీతోపాటు దేశవిదేశాల్లో అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చిన లక్ష్మీలు ఉన్నారు. వాలీబాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు అందుకున్న డి.వైష్ణవిని ఆంధ్రమహాసభ మహిళ శాఖ సభ్యులు ఘనంగా సత్కరించారు. వీరందరికి శాలువ, పుష్పగుచ్చాలతోపాటు మెమొంటోలను అందజేశారు. విశిష్ట మహిళలకు సత్కారంతోపాటు వంటల పోటీలలో గెలిచిన ముగ్గురు మహిళలకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి మహిళ శాఖ ఆధ్వర్యంలో చిరుకానుకలను అందచేసింది. ఆంధ్రమహాసభ నూతన అధ్యక్షుడు సంకు సుధాకర్, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్, ట్రస్టీ సభ్యులు మంతెన రమేష్‌లతోపాటు అనుమల్ల రమేష్‌లు మహిళలని అభినందించారు.
అలరించిన భక్తి గీతాలు...
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరలక్ష్మీ ఆలపించిన భక్తిగీతాలు అందరిని అలరించాయి. ముఖ్యఅతిథులతోపాటు ఇతర మహిళలు చేసిన హాస్యం అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో మహిళ శాఖ అధ్యక్షురాలు పి.భారత లక్ష్మి, కార్యదర్శి ఎస్.లత, ఉపాధ్యక్షురాలు టి.కరుణ, సంయుక్త కార్యదర్శి టి.అపరాజిత, కార్యవర్గ సభ్యులు ఎస్ విజయ, పద్మ, లత, పి దేవిరావ్, విజయలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు.