‘చెప్పినట్టు’ చేస్తేనే అప్పిస్తాం | world bank rules for amaravati | Sakshi
Sakshi News home page

‘చెప్పినట్టు’ చేస్తేనే అప్పిస్తాం

Published Mon, Nov 28 2016 2:49 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

‘చెప్పినట్టు’ చేస్తేనే అప్పిస్తాం - Sakshi

‘చెప్పినట్టు’ చేస్తేనే అప్పిస్తాం

‘రాజధాని రుణానికి’ ప్రపంచ బ్యాంకు షరతులు
పర్యావరణ, సామాజిక ప్రభావ, పునరావాస నివేదికలు తప్పనిసరి
29 గ్రామాల్లో ఆర్థిక సర్వే నివేదిక ఇవ్వాలి
అప్పులు తీర్చే మార్గమేమిటో చెప్పాలి
బడ్జెట్‌లో ప్రత్యేక పద్దు ఏర్పాటు చేయాలి
ప్రతీ ఇంటికి ఇచ్చే మంచినీళ్లకు, విద్యుత్‌కు మీటర్లు ఉండాలి
రాజధానికి ఇచ్చే రుణంపై ప్రపంచ బ్యాంకు షరతులు


సాక్షి, అమరావతి: ఏపీ నూతన రాజధాని అమరావతిలో రహదారులు, 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వరద నీటి నియంత్రణ పనులకు ప్రపంచ బ్యాంకు ప్రాథమికంగా రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. తొలి దశలో 30 శాతం రుణాన్ని (1,023 కోట్లు) రాజధానిలో 65.88 కిలోమీటర్ల నిడివిగల ఏడు సబ్‌–ఆర్టీరియల్‌ రోడ్లు నిర్మాణానికి మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులోనే గ్రామాల్లో మౌలిక వసతుల స్థాయిని పెంచేందుకు రూ. 450 కోట్లను మంజూరు చేయనుంది. అయితే రుణం ఇచ్చేందుకు పలు షరతులు విధించింది. ఆ షరతులకు కట్టుబడితేనే రుణం మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.

ప్రపంచ బ్యాంకు మిషన్‌ బృందం ఇప్పటికే సీఆర్‌డీఏ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. అంతే కాకుండా ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన, ఇవ్వని రైతులతోనూ పర్యావరణ, సామాజిక వేత్తలతోను సంప్రదింపులు జరిపింది. ఆ ఏడు రోడ్ల నిర్మాణానికి 781.22 ఎకరాల పూలింగ్‌లో వచ్చిన భూమితో పాటు మరో 17.16 ఎకరాలు సేకరించాలని ప్రపంచబ్యాంకు తేల్చింది. ఈ పరిధిలోని గ్రామాల్లో పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయన నివేదికలు సమర్పించాలని, అలాగే ల్యాండ్‌ పూలింగ్, భూ సేకరణకు సంబంధించి సహాయ పునరావాస, జీవనోపాధి పెంపు ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు సూచించిన సూచీలకు అనుగుణంగా 29 గ్రామాలకు చెందిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను వచ్చేనెల 15 కల్లా సమర్పించాలని కోరింది.

వరద నియంత్రణ నివేదిక ఇవ్వాలి..
రాజధాని ప్రాంతంలోకి వచ్చే వరద స్థాయితో పాటు అందుకు అనుగుణంగా రహదారులు, వంతెనలు, యుటిలిటీ డక్స్‌ స్థాయిని నిర్ధారించాలని స్పష్టం చేసింది. వరద నియంత్రణకు సంబంధించిన పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనా నివేదికను వచ్చే నెలాఖరుకు సమర్పించాలంది. ఈ ప్రాజెక్టును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా చేపట్టబోమని, ఎన్‌ఐసీ ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారానే చేపడతామని బ్యాంకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఇ–ప్రొక్యూర్‌మెంట్‌పై బ్యాంకు అనుమానాలను వ్యక్తం చేసింది. అమరావతి కేపిటల్‌ సిటీ అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక పద్దును వచ్చే నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని బ్యాంకు స్పష్టం చేసింది. అలాగే తామిచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించే నిధుల లభ్యత గురించి తెలియజేయాలని పేర్కొంది. ఏపీసీఆర్‌డీఏ ఆర్థిక నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రజల నుంచి రాబట్టాలి..
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల స్థాయిని పెంచిన తరువాత వాటి నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా ఆయా గ్రామాల్లోని కుటుంబాల నుంచి వసూలు చేయాలని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ప్రతీ ఇంటికి తప్పనిసరిగా వాటర్, విద్యుత్‌ మీటర్లను అమర్చాల్సిందేనని, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థకు తగిన నిర్వహణ ఉండాలని, ఇందుకయ్యే వ్యయాన్ని వినియోగదారుల నుంచి రాబట్టాలని చెప్పింది. లేదంటే ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో దానిని భరించాలని బ్యాంకు స్పష్టం చేసింది.

29 గ్రామాల్లోని కుటుంబాల ఆర్థిక, సామాజిక ప్రభావం ఆధారంగా ఆయా కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాల కల్పనపై నివేదిక సమర్పించాలని సూచించింది. పేదరిక సామాజిక ప్రభావ అంచనా నివేదికతో పాటు క్లయిమెట్‌ స్క్రీనింగ్‌ నివేదికను వచ్చే నెలాఖరు నాటికి సమర్పించాల్సిందిగా బ్యాంకు స్పష్టం చేసింది. ఇవన్నీ సమర్పిస్తే జనవరి నెలలో రుణం మంజూరుపై తుది నిర్ణయం తీసుకోనుంది.

ల్యాండ్‌ పూలింగ్‌కు చట్టబద్ధత లేదన్నారు..
రాజధానిలో మౌలిక వసతులు అభివృద్ధిచేస్తే గానీ తమకిచ్చే ప్లాట్లను అమ్ముకోలేమని ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతుS స్పష్టం చేసినట్లు ప్రపంచ బ్యాంకు బృందం తెలిపింది. అలాగే న్యాయవాదులు, సామాజిక వేత్తలను, ల్యాండ్‌ పూలింగ్‌లో చేరని రైతులను కూడా సంప్రదించినట్లు బ్యాంకు బృందం పేర్కొంది. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతాన్నే వారు తప్పుపట్టారని, ల్యాండ్‌ పూలింగ్‌కు చట్టబద్ధత లేదని వారు తెలిపారని బృందం తెలిపింది. అయితే తొలిదశలో చేపట్టే 7 సబ్‌–ఆర్టీరియల్‌ రోడ్లును 4 ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement