పంచ సూత్రాలతో అక్షరప్రస్థానం
‘పంచ సూత్రాలతో నా అక్షర ప్రస్థానం కొనసాగింది. ఇప్పుడూ అదే రీతిలో కొనసాగుతోం ది’ అని సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ డాక్టర్ కే.రామచంద్రమూర్తి అన్నారు. డబ్ల్యూ టీఎఫ్ వార్షిక వేడుకలో భాగంగా ఆదివారం చెన్నైలో బీఎస్‌ఆర్ కృష్ణ స్మారక పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. అలాగే, యార్లగడ్డ శంభుప్రసాద్ - ప్రభావతి స్మారక పురస్కారాన్ని నటి, కూచిపూడి నృత్య కళాకారిణి డీ.ప్రభరమేష్ అందుకున్నారు.
సాక్షి, చెన్నై :నగరంలోని రాణి సీతై హాల్‌లో ఆదివారం సాయంత్రం ప్రపంచ తెలుగు సమాఖ్య 22వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో ప్రముఖ సీనియర్ పాత్రికేయులు బీఎస్‌ఆర్ కృష్ణ స్మారక పురస్కారాన్ని సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ డాక్టర్ కే.రామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. అలాగే, యార్లగడ్డ శంభు ప్రసాద్- ప్రభావతి స్మారక పురస్కారాన్ని నటి డీ.ప్రభ రమేష్‌కు అందజేశారు. డబ్ల్యూటీఎఫ్ అధ్యక్షురాలు వీఎల్ ఇందిరాదత్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో రామచంద్రమూర్తి, డీ.ప్రభరమేష్‌లను ముఖ్యఅతిథి హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి సన్మానించారు. అవార్డుకు గాను షీల్డ్‌ను బహూకరించారు. ముందుగా తనుకుకు చెందిన చిన్నారి కుమారి ఖ్యాతి కూచి పూడి నృత్యంతో ఆహుతుల్ని ఆహ్వానించి అలరించింది. అలాగే, గాయనీమణులు హరిణి, పావని, సమీరా భరద్వాజ్‌లు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్రార్థన ఆలకించారు. ఇక, ఈ వేడుకలో భాగంగా సీని సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నేతృత్వంలో బోల్ బేబి బోల్ ఫెం గాయనీ, గాయకులు రోహిత్, సాయిచరణ్, శివ, హరిణి, పావని, సమీరా భరద్వాజ్‌ల సంగీత విభావరి వీనులవిందుగా సాగింది. సత్కార వేడుక అనంతరం జబర్దస్త్ ఫేం - సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బృందం హాస్య హరివిల్లు హాస్యపు జల్లుల్ని కురిపించాయి.
పంచ సూత్రాలతో అక్షర ప్రస్థానం
సత్కార అనంతరం కె రామచంద్ర మూర్తి ప్రసంగిస్తూ, తన తత్వానికి ఈ అవార్డు సరిపోదని, అయితే, ఆహ్వానించిన సంస్థ నేపథ్యం, బీఎస్‌ఆర్ కృష్ణ మీదున్న అపరా గౌరవం ఇక్కడికి రప్పించిందన్నారు. అక్షర తప్పస్సుతో సమాజ హితాన్ని కాంక్షిస్తూ తాను పనిచేస్తూ వస్తున్నానని పేర్కొన్నారు. మజిలీలు, పత్రికలు, చానళ్లు ఏదైనా తాను మాత్రం పంచ సూత్రాలను ప్రధానంగా పాటిస్తానని వివరించారు. ఆరోగ్యం, విద్య, దళిత, మైనారిటీల అభివృద్ధి, మహిళా సంక్షేమం, పౌర హక్కుల పరిరక్షణ తన పంచ సూత్రలు అని, వీటిని అనుసరిస్తూ, అక్షర యాత్రను కొనసాగించానని, కొనసాగిస్తూ ఉన్నానని చెప్పారు. జర్నలిజం వృత్తిగా స్వీకరించి నర్ల వెంకటేశ్వరరావు, జీకే రెడ్డి, కుష్వంత్‌సింగ్ వంటి వారి ప్రేరణతో ముందుకు సాగుతున్నానన్నారు. ఇలాంటి ప్రోత్సాహాన్ని నలభై, యాభై వడిలో ఉన్న జర్నలిస్టులకు ఇస్తే, మరో ముఫ్పై ఏళ్లు ఈ వృత్తిలో కొనసాగిస్తారని పేర్కొన్నారు. నిబద్దత, నిజాయితీతో రాణిస్తున్న ఆ వయస్సులోని జర్నలిస్టులను ప్రోత్సహించే విధంగా బీఎస్‌ఆర్ అవార్డును ఈ సంస్థ ప్రదానం చేయాలని సూచించారు. నటి ప్రభరమేష్ ప్రసంగిస్తూ, ఆశీర్వాదంగా భావించి తాను ఈ అవార్డును అందుకున్నట్టు ఆనందం వ్యక్తం చేశారు. తన సేవల్ని ఈ సమాఖ్యకు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలుగే ముద్దు
ముఖ్య అతిథి శాంతా బయోటెక్నిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ, తెలుగు సంస్కృతి, ఆచార వ్యవహారాలు భావితరాలకు తెలియాలంటే, భాషను కాపాడుకోవడంలోనే ఉందన్నారు. విజ్ఞత, రసజ్ఞత రెండు తెలుగు వారికి రెండు కళ్లుగా పేర్కొన్నారు. అందుకే తెలుగు గొప్పదననాన్ని కొన్ని పాటలు ద్వారా విన్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గానం చేసిన కొన్ని పాటలను ఈసందర్భంగా విన్పించారు. ఆంగ్లం నేర్చుకోవాలని, అయితే, మధురమైన తెలుగు భాషను మరవ కూడదన్నారు. తెలుగు ముద్దు, ఆంగ్లం అవసరం అన్న నినాదంతో ముందుకు వెళ్తామని పిలుపు నిచ్చారు. వీఎల్ ఇందిరాదత్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ, తెలుగు భాషాభివృద్ధికి తమ సమాఖ్య అందిస్తున్న సేవల్ని వివరించారు. విశాఖలో నిర్మిస్తున్న తెలుగు జాతి గర్వించ దగ్ద సాంస్కృతిక నికేతన్ ఏర్పాటు అవుతున్నదని, మార్చి లేదా ఏప్రిల్‌లో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె రూ.ఐదు లక్షలు చెక్కును సమాఖ్యకు విరాళంగా అందజేశారని ప్రకటించారు. డబ్ల్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం ఆదిశేషయ్య వార్షిక నివేదికను చదివి విన్పించారు. ఈ వేడుకలో డబ్ల్యూ టీఎఫ్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రతినిధులు కవిత, శివరాంప్రసాద్, శ్రీలక్ష్మీమోహన్‌రావు, రవీంద్ర నాథ్, రుక్మిణి, ప్రమీల ఆనంద్‌లతో పాటుగా పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.