![యువతి హత్య - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/71494973975_625x300.jpg.webp?itok=da9LhN0W)
యువతి హత్య
క్షణికావేశంలో తుపాకీతో కాల్చి చంపిన యువకుడు
జయపురం: క్షణికావేశంలో ఓ యువకుడు తన మామ కుమార్తెను నాటు తుపాకీతో కాల్చి చంపాడు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జయపురం సమితి భరిణిపుట్ గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నిర్మల బాగ్ వదిన చనిపోగా ఆమె మూడురోజుల కర్మకాండ ఆయన ఇంటిలో జరుగుతుండడడం కార్యక్రమంలో పాల్గొనేందుకు బంధువులు వచ్చారు. ఈ కార్యక్రమానికి నిర్మల బాగ్ మేనల్లుడు అజిత్ ఖొర(25)కూడా ఉమ్మిరి గ్రామం నుంచి వచ్చాడు. ఫంక్షన్ లో అందరూ మమేకమై ఉన్న సమయంలో అజిత్ ఖొర తన మామ కూతురు పింకిబాగ్(22)తో మాట్లాడాలని చెప్పి మేడపైకి తీసుకు వెళ్లాడు.
నిందితుడిని చితకబాదిన బంధువులు
మేడపై ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దాంతో కోపోద్రిక్తుడైన అజిత్ ఖొర తన వద్ద గల నాటు పిస్టల్‌తో ఆమెకు దగ్గరగా వెళ్లి మూడు రౌండ్‌లు కాల్చాడు. రెండు బుల్లెట్‌లు పింకి శరీరంలో దిగగా, మరొకటి ఆమె తలకు తగిలింది. తూటాలు తగలగానే అమె కింద పడిపోయింది. మేడపై పిస్టల్ పేలిన శబ్దం వినిపించగా కిందనున్న వారంతా ఏం జరిగిందా? అని మీదకు వెళ్తున్న సమయంలో నిందితుడు కిందకు పరుగు తీశాడు.
మేడపైకి వచ్చిన వారు రక్తపుమడుగులో పడి ఉన్న పింకీబాగ్‌ను చూసి హాహాకారాలు చేయగా కిందకు పారిపోతున్న అర్జున్ ఖొరను కొంతమంది పట్టుకున్నారు. పింకిని పిస్టల్‌తో కాల్చిచంపాడని తెలుసుకుని చితకబాదారు. వెంటనే బమిణిగాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించి నిందితుడు అజయ్ ఖొరను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలోనే మరణించిన పింకి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా చావుదెబ్బలు తిని గాయపడిన నిందితుడు అర్జున్‌ఖొరను ఆస్పత్రిలో చేర్చారు.
ప్రేమ విఫలమే కారణమా?
పింకి మరణానికి కారణమైన పిస్టల్, తూటాలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు ప్రధాన కారణం ప్రేమ విఫలమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పింకి బాగ్, అజిత్ ఖొరలు పరస్పరం ప్రేమించుకున్నారని అయితే వారి ఉభయ కుటుంబాలు అంగీకరించక పోవడం వల్ల అజిత్ కోపంతో ఈ హత్యకు పాల్పడి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పింకి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి ఆమె బంధువులకు అప్పగించారు.